05-12-2025 12:03:35 AM
జహీరాబాద్, డిసెంబర్ 4 : శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో దత్త ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. గత రెండు రోజులుగా వివిధ రకాల పూజలు, యజ్ఞాలతో ఆశ్రమం భక్తి పారవశ్యంలో మునిగింది. రాత్రి వేళల్లో భజన సంకీర్తనలు ఆశ్రమ పీఠాధిపతి ప్రవచనం జరిగింది. గురువారం ఉదయం నుండే యజ్ఞ గుండాలలో యజ్ఞం నిర్వహిస్తూ భక్తులు, యజ్ఞక్రతులు పాల్గొన్నారు. యజ్ఞం తర్వాత దత్తాత్రేయుల డోలారోహణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం చండీ యాగం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
దస్తగిరి ఆశ్రమ పీఠాధిపతి వైరాగ్య శిఖామని 108 అవధూత గిరి మహారాజ్ భక్తులకు తీర్చ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. సాయంత్రం 6 గంటలకు 21 వేల దీపాలతో లింగాకారంలో వెలిగించి దత్తాత్రేయ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొని దత్తాత్రేయుని దర్శించుకున్నారు.