24-02-2026 12:00:00 AM
కలెక్టర్ పి.ప్రావీణ్య
సంగారెడ్డి, ఫిబ్రవరి 23(విజయక్రాంతి): జిల్లాలో జరగనున్న పదవ తరగతి వార్షిక పరీక్షలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి పరీక్షల నిర్వహణపై సమగ్ర సమీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 14 నుండి ఏప్రిల్ 15 వరకు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించబడతా యని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 24,657 మంది విద్యార్థులు ఎస్సెస్సీ పరీక్షలకు హాజరుకానున్నారని, వీరి కోసం 123 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు నిర్ణీత సమయానికి ముందుగానే చేరుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.
పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు చేసి, తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్షల సమయంలో పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ కేంద్రాలు మూసివేయాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు రవాణా పరంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్ష సమయాలకు అనుగుణంగా బస్సులు నడిపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు.
ఎంఈఓలు పరీక్షా కేంద్రాలను ముందస్తుగా తనిఖీ చేసి అన్ని మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి గోవిందురామ్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ వసంత్ రావు, పోలీస్, ఆర్టీసీ, పోస్టల్, విద్యుత్, ట్రాన్స్పోర్ట్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.