10-12-2025 01:15:08 AM
నిజామాబాద్, డిసెంబర్ 9 (విజయ క్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను నిజామాబాద్ జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు.
మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణీ కుముదిని పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహిం చిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ టి.విన య్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్యాంప్రసాద్ లాల్, అదనపు కలెక్టర్ అంకిత్ తదితరులు సమీకృత జిల్లా సముదాయాల కార్యాలయం వీ.సీహాల్ నుంచి పాల్గొన్నారు.
తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ, ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ఏర్పాటు, పోస్టల్ బ్యాలెట్, వెబ్ క్యాస్టింగ్ ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాలలో వసతులు, పోలీసు బందోబస్తు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, నిఘా బృందాల పనితీరు పర్యవేక్షణ తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణీ కుముదిని సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లాలో మొదటి విడతగా ఈ నెల 11న పోలింగ్ నిర్వహించనున్న మండలాల్లో చేపట్టిన ఏర్పాట్ల గురించి కలెక్టర్ తెలియజేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని అన్నారు.
తొలి విడతలో జిల్లాలోని బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పోతంగల్, రెంజల్, రుద్రూర్, సాలూర, వర్ని, ఎడపల్లి, నవీపేట మండలాలలో ఈ నెల 11న పోలింగ్ నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. 184 సర్పంచ్, 1642 వార్డు సభ్యులస్థానాలకు గాను, 27 గ్రామ పంచాయతీల పరిధిలో నామినేషన్ల ఉపసంహరణ నాటికే సర్పంచ్ వార్డు స్థానాలు అన్నీ ఏకగ్రీవం అయ్యాయని వెల్లడించారు.
పోలింగ్ నిర్వహణలో భాగంగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలుగా ఎంపిక చేసిన మండల పరిషత్ కార్యాలయాలకు పోలింగ్ మెటీరియల్ పంపడం పూర్తయ్యిందని, పోలింగ్ సిబ్బంది బుధవారం ఉదయం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుండి పోలింగ్ సామాగ్రి తీసుకుని నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు బందోబస్తు మధ్య చేరుకునేలా కట్టుదిట్టంగా ఏర్పాటు చేశామని అన్నారు.
రిటర్నింగ్ అధికారులకు, ప్రిసైడింగ్ అధికారులకు ఎన్నికల నిర్వహణ విధులపై శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి పూర్తి అవగాహన కల్పించామని, మూడు విడతల ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని కేటాయించామని తెలిపారు. ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటించేలా కౌంటింగ్ కు ఏర్పాట్లు చేశామని అన్నారు.
పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలు పూర్తి పారదర్శకంగా, సాఫీగా జరిగేలా సూక్ష్మ పరిశీలకులతో పాటు, సెక్టోరల్ అధికారులను నియమించి, అన్ని చర్యలు తీసుకున్నామని, 31 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నామని, వెబ్ క్యాస్టింగ్ చేయిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీపీఓ శ్రీనివాస్ రావు, నోడల్ అధికారులు పాల్గొన్నారు.