10-01-2026 02:00:37 AM
కోల్‌కతా/న్యూఢిల్లీ, జనవరి ౯: బొగ్గు కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఐ సంస్థ కార్యాలయంతోపాటు ఆ సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంలో సోదాలు చేయడంపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ, టీఎంసీ నేతలు భగ్గుమన్నారు. శుక్రవారం ఈ మేరకు సీఎం తమ పార్టీ శ్రేణులతో కలిసి కోల్‌కతాలో ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాజకీయంగా టీఎంసీ ఎదుర్కోలేకే బీజేపీ ప్రభుత్వం ఇలా ఈడీ, దర్యాప్తు సంస్థలను అడ్డంపెట్టుకుని బెదిరిపులకు పాల్పడుతున్నదని నిప్పులు చెరిగారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రమేయంతోనే ఈ దాడులు జరగుతున్నాయని ఆరోపించారు. తనను తక్కువ అంచనా వేయొద్దని, తాను తలుచుకుంటే బొగ్గు కుంభకోణంలో కేంద్ర మంత్రి అమిత్‌షా పాత్రను బట్టబయలు చేస్తానని హెచ్చరించారు.
అందుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన పెన్‌డ్రైవ్ ఒకటి తన వద్ద ఉందని, త్వరలో దానిలోని వివరాలు లోకానికి చాటిచెప్తానని పేర్కొన్నారు. తాను హార్డ్‌డిస్క్‌లతోపాటు కీలకమైన పత్రాలను వెంట తీసుకెళ్లాననే ఆరోపణలపైనా ఆమె స్పందించారు. ఐవూ కార్యాలయంలో ఉన్న కొన్ని రికార్డులు, హార్డ్ డిస్క్‌ల్లో పార్టీకి సంబంధించిన కీలక సమాచారం ఉందని, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల సమాచారం కూడా ఉందని, అందుకే వాటిని వెనక్కి తీసుకొచ్చానని తెలిపారు.
కోర్టు గదిలో తోపులాట.. విచారణ ఈ ౧౪కు వాయిదా
కోలకతా హైకోర్టులో ఐ- కార్యాలయంపై ఈడీ దాడులపై జరగాల్సిన విచారణ న్యాయవాదుల మధ్య చోటుచేసుకున్న తోపులాట కారణంగా నిలిచింది. ఈడీ, టీఎంసీ దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ సువ్రా ఘోష్ విచారణ ప్రారంభించిన కొద్దినిమిషాల్లోనే కోర్టు గదిలో గందరగోళం నెలకొంది. ఎంతోమంది న్యాయవాదులు కోర్టు రూంలో గుమిగూడటంతో పరిస్థితి అదుపు తప్పింది.
ఈ కేసుతో సంబంధం లేని వారు ఐదు నిమిషాల్లోపు గది నుంచి బయటకు వెళ్లాలని, లేనిపక్షంలో తాను విచారణను నిలిపివేసి వెళ్లిపోతానని న్యాయమూర్తి పలుమార్లు హెచ్చరించారు. అయితే.. ఎవరు అక్కడ ఉండాలి, ఎవరు వెళ్లాలి.. అనే అంశంపై న్యాయవాదుల మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్తా తోపులాటకు దారితీసింది. దీంతో న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టు గది నుంచి బయటకు వెళ్లారు. దీంతో ఈ విచారణ ఈనెల జనవరి 14వ తేదీకి వాయిదా వేసింది.
సీఎం సోదాలను అడ్డుకున్నారు: ఈడీ
ఐ ప్యాక్ కార్యాలయంలో చట్టపరమైన దర్యాప్తును సీఎం మమత అడ్డుకున్నారని, ఆమెతో కలిసి రాష్ట్ర పోలీసులు కీలక ఆధారాలను బలవంతంగా తీసుకుపోయారని ఢిల్లీలోని ఈడీ కార్యాలయం ఆరోపించింది. మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా దర్యాప్తు సంస్థ విధులు నిర్వహిస్తుండగా ముఖ్యమంత్రి తమ భద్రతా సిబ్బందితో కలిసి వచ్చి సోదాలను అడ్డుకున్నారని పేర్కొన్నది.
సీఎం ఓ ఐ- ప్యాక్ ప్రతినిధి మొబైల్‌ను లాక్కున్నారని, కార్యాలయంలో ఎలాంటి ఆధారాలు లభించలేదని పంచనామాలో రాయాలని డీజీపీ తమపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించింది. నిబంధనల ప్రకారం దర్యాప్తు సాగనివ్వకుండా అడ్డుకోవడమే కాకుండా.. తాము చెప్పినట్లు వినకపోతే అధికారులను అరెస్టు చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు బెదిరించినట్లు తెలిపింది.
ఢిల్లీలో తృణమూల్ ఎంపీల ధర్నా
కోల్‌కతాలోని ఐ -ప్యాక్ కార్యాలయంపై ఈడీ నిర్వ హించిన సోదాలకు నిరసన గా దేశ రాజధాని ఢిల్లీలో టీఎంసీ ఎంపీలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. వారంతా కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాసంతోపాటు ఆయన కార్యాల యం ముట్టడికి యత్నించారు. ఈ ధర్నాలో ఎంపీలు మహువా మోయిత్రా, కీర్తి ఆజాద్, డెరెక్ ఓబ్రెయిన్ పలువురు ఉన్నారు. మీడియాతో మహువా మోయిత్రా మాట్లాడుతూ..
సీఎం మమతా బెనర్జీ ఒక సింహంలా తన పార్టీ ర హస్యాలను రికార్డులు, హార్డ్ డిస్క్‌ల్లో ఉంచారని, వాటిని కాపాడుకోవడం పార్టీ అధినేత్రి విధ్యుక్త ధర్మమని పేర్కొన్నారు. కేంద్ర హోం మంత్రి కనుసన్నల్లోనే ఈడీ దాడులు నిర్వహిస్తోందని ఆరోపించారు. ఈడీ దాడులు చేసిన ఐ-ప్యాక్ సంస్థ కేవలం కన్సల్టెన్సీ మాత్రమే కాదని, తమ పార్టీ ఐటీ, మీడియా విభాగాలు నిర్వహిస్తోందని తెలిపారు. అలాంటి చోట ఈడీ సోదాలు ముమ్మాటికీ రాజకీయ కక్షసాధింపేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.