calender_icon.png 11 January, 2026 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

63 మంది మావోయిస్టుల లొంగుబాటు

10-01-2026 01:53:31 AM

  1. వీరిలో ౧౮ మంది మహిళా మావోయిస్టులు
  2. ౬౩ మందిలో 36 మంది తలలపై భారీ రివార్డులు
  3. మొత్తం రివార్డుల విలువ రూ.1.19 కోట్లు
  4. వివరాలు వెల్లడించిన దంతేవాడ ఎస్పీ గౌరవ్ రాయ్

చర్ల/రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్ట్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం 63 మంది మావోయిస్టులు దంతేవాడ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారిలో ౧౮ మంది మహిళా మావోయిస్టులే. వీరంతా ఎస్పీ గౌరవ్ రాయ్ సమక్షంలో ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలో కలిశారు. లొంగిపోయిన వారిలో కీలక నేతలు ఉన్నారని, లొంగిపోయిన 63 మందిలో 36 మందిపై ప్రభుత్వం గతంలో భారీ రివార్డులను ప్రకటించిందని పోలీసులు వెల్లడించారు.

వీరిపై ఉన్న మొత్తం రివార్డు విలువ సుమారు రూ.1.19 కోట్లు ఉంటుందని తెలిపారు. మిగిలిన వారు పార్టీలోని వివిధ విభాగాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నట్లు వివరించారు. మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతాల పట్ల విరక్తి చెందడం, అంతర్గత వివక్ష, ప్రభుత్వం అమలు చేస్తున్న ’లోన్ వర్రాటు’ (తిరిగి రండి) వంటి పునరావాస కార్యక్రమాల పట్ల నమ్మకంతోనే వీరు లొంగిపోయినట్లు ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరఫున అందే అన్ని రకాల ప్రయోజనాలను కల్పిస్తామని, తక్షణ సహాయం కింద నగదును సైతం అందజేశామని ఎస్పీ తెలిపారు.

ఇప్పటికీ అడవుల్లో ఉన్న వారు హింసా మార్గాన్ని వీడి లొంగిపోవాలని పిలుపునిచ్చారు. బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ పాటిలింగం మాట్లాడుతూ.. బస్తర్‌లో శాశ్వత శాంతిని నెలకొల్పేందుకు పోలీస్‌శాఖ కృషి చేస్తోందన్నారు. గడిచిన రెండేళ్లలో ఒక్క దంతేవాడ జిల్లాలోనే 572 మంది మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలిశారని తెలిపారు. మిగిలిన వారు కూడా అడవిబాట వీడాలని పిలుపునిచ్చారు.