calender_icon.png 10 January, 2026 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలి

08-01-2026 12:00:00 AM

రాష్ట్ర స్థాయి 6వ గిరిజన సంక్షేమ క్రీడా పోటీలు ప్రారంభించిన మంత్రి సీతక్క

ఏటూరునాగారం, జనవరి 7 (విజయక్రాంతి): విద్యార్ధులు అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలని,ఆదివాసీ గిరిజన విద్యార్థులు క్రీడల్లో నైపుణ్యతను ప్రోత్సహించడం, ప్రతిభావంతులను గుర్తించడం, రాష్ట్ర స్థాయిలో అవకాశాలు కల్పించడమే 6వ రాష్ట్ర స్థాయి గిరిజన సంక్షేమ క్రీడా పోటీలు నిర్వహించే ముఖ్య ఉద్దేశమని మంత్రి సీతక్క అన్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ,గిరిజన కమిషన్ ఆధ్వర్యంలో ఐటిడిఏ ఏటూరునాగారం మండల కేంద్రంలోనీ జంబోరి మైదానంలో బుదవారం రాష్ట్ర స్థాయి క్రీడా పోటీ లు నిర్వహించగా ముఖ్య అతిథిగా రాష్ట్ర పం చాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా,మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క పాల్గొని క్రీడా జ్యోతి వెలిగించి క్రీడలను ప్రారంబించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన విద్యార్థులకు, గిరిజన క్రీడాకారుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని వారి ఎదుగుదలకు,అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడా పోటీలు ములుగు జిల్లాలో నిర్వహించడం చాలా గర్వకారణం అని రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆటపాటలతో పాటు చదువులో కూడా ప్రతిభ కనబరచాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ట్రైబల్ వెల్ఫేర్ విద్యాలయాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు మంచి ఫలితాలతో ముందుకు సాగుతున్నారని అదేవిధంగా రాబోయే టెన్త్ ఇంటర్ వార్షిక పరీక్షలలో ప్రథమ స్థానంలో ఉండేలా చదవాలని సూచించారు.

విద్యార్థి దశలోనే శరీర దృఢత్వం అలవర్చుకోవాలని ఆరోగ్యమే మహాభాగ్యమని, విద్యార్థులు శ్రమదానం చేయడం,ఇతరులకు సహాయం చేయడం వంటి మంచి లక్షణాలు నేర్చుకోవాలని పేర్కొన్నారు. స్మార్ట్ ఫోన్,టెలివిజన్ కు ఆకర్షితులైన పిల్లలు మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,వసతి గృహాలలో ఉండే పిల్లలు ప్రతిరోజు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ చదువుకోవాలని అన్నారు. క్రీడలలో గెలుపు ఓటమి సహజమని క్రీడలు స్నేహ పూర్వకంగా జరగాలని ఓడిపోయిన విద్యార్థులు తమలోపాలను తెలుసుకుంటూ రాబోయే క్రీడల్లో గెలుపు సాధించే విధంగా శ్రమించాలని గెలుపొందిన విద్యార్థులు మరింత ఉన్నత లక్ష్యాలను సాధించడానికి కృషి చేయాలని స్పష్టం చేశారు.