17-05-2025 10:26:06 PM
కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు..
కొత్తగూడెం కలెక్టరేట్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు(MLA Kunamneni Sambasiva Rao) అన్నారు. జిల్లాలో విద్యుత్ ఉప కేంద్రాలు, కార్యాలయాల శంకుస్థాపన, హై లెవెల్ బ్రిడ్జిల ప్రారంభోత్సవ శనివారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు(Deputy CM Bhatti Vikramarka Mallu) నిర్వహించారు. ఈ సందర్భంగా ఐడిఓసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ... జిల్లాను అభివృద్ధి పదంలో నిలిపేందుకుగాను ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
కొత్తగూడెం జిల్లా అన్ని వనరులు పుష్కలంగా ఉన్నాయని జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేందుకు గాను పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవలసి ఉన్నదని వాటిని ఉప ముఖ్యమంత్రి కి వివరించారు. జిల్లాలో అటవీ భూమి అధికంగా ఉందని, పర్యాటకంగా అభివృద్ధిపరిచేందుకుగాను జిల్లాలో జూ పార్క్ ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో ఎయిర్పోర్ట్ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అదేవిధంగా జిల్లాలో పాస్ పోర్ట్ ఆఫీస్, ముర్రేడు వాగు రిటర్నింగ్ వాళ్లు నిర్మాణం, కొత్తగూడెంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మంజూరు చేయాలన ఉప ముఖ్యమంత్రిని కోరారు. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద క్రీడా మైదానం జిల్లాలో 25 ఎకరాలలో ఏర్పాటుకు కృషి చేయాలన్నారు.
జిల్లాలో ఉన్నటువంటి పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని , కేటీపీఎస్ లో ఉన్నటువంటి 24 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులైజేషన్ చేయాలని, మిగతా కార్మికులకు ఐడి కార్డులు అందజేయాలని కోరారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రజలకు పలు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తుందని, వాటితోపాటు జిల్లా అభివృద్ధికి అవసరమైన అన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రిని కోరారు.