calender_icon.png 11 September, 2025 | 4:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విపత్తు సమయాల్లో సమర్థవంతంగా సేవలందించాలి

11-09-2025 01:50:14 AM

’ఆపద మిత్ర’ మాస్టర్ ట్రైనర్లకు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ హితవు 

నిజామాబాద్, సెప్టెంబర్ 10 (విజయ క్రాంతి): అనుకోని రీతిలో ప్రకృతి విపత్తులు సంభవించిన సమయాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టేలా అన్ని విధాలుగా సన్నద్ధం అయి ఉండాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. మాస్టర్ ట్రైనర్లుగా శిక్షణ పూర్తి చేసుకున్న ఐదుగురు ఆపద మిత్ర వాలంటీర్లు బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ను కలిశారు.

జిల్లాలో 300 మంది ఆపద మిత్ర వాలంటీర్లు మొదటి విడత శిక్షణ పూర్తి చేసుకోగా, వారిలో నిజామాబాద్ జిల్లా నుండి ఐదుగురిని, ఖమ్మం జిల్లా నుండి ఐదుగురు, నల్లగొండ జిల్లా నుండి పది మందిని మాస్టర్ ట్రైనింగ్ కోసం ఎంపిక చేసి బెంగళూరులోని ఆర్.ఏ.ముండ్ కూరు ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అకాడమీలో 21 రోజుల పాటు మరింత మెరుగైన శిక్షణ అందించారు.

నిజామాబాద్ జిల్లా నుండి ఎన్.సురేఖ, జె.జమున, బి.రాజు, టి.వెంకటేష్, జి.సునీల్ లు శిక్షణను పూర్తి  చేసుకుని వచ్చిన సందర్భంగా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ వారిని అభినందిస్తూ, మాస్టర్ ట్రైనర్ సర్టిఫికెట్లను అందజేశారు. మూడు వారాల పాటు బెంగళూరులో అందించిన శిక్షణలో నేర్చుకున్న అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎన్.డీ.ఆర్.ఎఫ్, ఎస్.డీ.ఆర్.ఎఫ్, బృందాలు ప్రతీ చోట అందుబాటులో ఉండే అవకాశాలు లేనందున, విపత్తు సమయాలలో తక్షణమే స్పందించి సహాయ కార్యక్రమాలు చేపట్టేలా ఆపద మిత్ర వాలంటీర్లకు శిక్షణ అందించడం జరుగుతోందని ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ తెలిపారు.

మాస్టర్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వాలంటీర్లు మిగతా వాలంటీర్లకు విపత్తులు సంభవించిన సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆస్తి, ప్రాణ నష్టాన్ని ఎలా నివారించాలి అనే అంశాలపై మెళుకువలు తెలుపాలని సూచించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను గుర్తుంచుకుని, విపత్తులు వాటిల్లిన సమయాల్లో సుశిక్షితులైన సైనికుల వలె  సమర్ధవంతంగా సేవలు అందించాలని సూచించారు.

ఈ సందర్బంగా వాలంటీర్లు తమ అనుభవాలను, మాస్టర్ ట్రైనింగ్ లో నేర్చుకున్న అంశాల గురించి వివరాలు పంచుకున్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ డి-సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు.