17-01-2026 02:15:45 AM
జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి
నిజామాబాద్, జనవరి 16 (విజయ క్రాంతి): మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు భీంగల్, ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీల వార్డులకు మహిళా రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(కలెక్టరేట్)లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో ఈ నెల 17న (శనివారం) గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ డ్రా నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. భీంగల్ మున్సిపాలిటీకి సంబంధించిన వార్డుల మహిళా రిజర్వేషన్ల ఖరారు కోసం ఉదయం 10.00 గంటలకు డ్రా నిర్వహిస్తామని అన్నారు.
అదేవిధంగా ఆర్మూర్ మున్సిపాలిటీ వార్డుల ఖరారుకై ఉదయం 10.15 గంటలకు, బోధన్ మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్ల ఖరారు కోసం ఉదయం 10.30 గంటలకు, నిజామాబాద్ నగర పాలక సంస్థ డివిజన్లలో మహిళా రిజర్వేషన్ల ఖరారు కోసం ఉదయం 11.00 గంటలకు డ్రా ప్రక్రియ కొనసాగుతుందని సూచించారు. ఈ సమావేశానికి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సకాలంలో హాజరు కావాలని కలెక్టర్ కోరారు.