17-01-2026 02:14:17 AM
పరారీలో మరో 9 మంది
మొబైల్ అప్లికేషన్ ద్వారా చలాన్ రుసుము తగ్గింపు
మహబూబాబాద్, జనవరి 16 (విజయక్రాంతి): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్ల కుంభకోణం కేసులో మొత్తం ముఠాలోని 15 మందిని జనగామ పోలీసులు శుక్రవారం అరె స్టు చేశారు. మరో తొమ్మిది మంది పరారీలో ఉన్నారు. ముఠా సభ్యుల నుంచి 63.19 లక్షల నగదు, బ్యాంక్‌లో రూ.లక్ష, సుమారు ఒక కోటి రూపాయల విలువైన ఆస్తి పత్రాలు, ఒక కారు, రెండు ల్యాప్‌టాప్‌లు, ఐదు డెస్క్ టాప్ కంప్యూటర్లు, 17 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
యాదాద్రి-భువనగిరి, జనగామ జిల్లాలకు చెందిన వసునూరి బసవరాజు, జెల్లా పాండు, మహేశ్వరం గణేష్‌కుమార్, ఈగజులపాటి శ్రీనాథ్, యెనగంధుల వెంకటేష్, కోదురి శ్రావణ్, కొలిపాక సతీష్ కుమార్, తదూరి రంజిత్ కుమార్, దుంపల కిషన్‌రెడ్డి, దశరథ మేఘావత్, నారా ఖాను ప్రసాద్, గొపగాను శ్రీనాథ్, ఒగ్గు కర్నాకర్, కమల్ల శివకుమార్, అలేటి నాగరాజును అరెస్ట్‌చేసినట్లు వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్ల కుంభకోణం కేసులో ప్రధాన నిందితులైన పసునూరి బసవరాజు, జెల్లా పాండు సులభంగా డబ్బు సంపాదించడాని కి అలవాటు పడ్డారు.
జనగామ, యాదాద్రి జిల్లా ల్లో మీ సేవ, ఆన్‌లైన్ సర్వీసులు, మధ్యవర్తులతో భారీ కమీషన్ ఇస్తానని ఒప్పందం చేసుకుని ముఠాగా ఏర్పడ్డారు. వీరి ద్వారా ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్ పత్రాలను ప్రధాన నిందితులు తెప్పించుకుని, తమ వద్దే వెబ్‌సైట్‌లో నమోదు చేసేవారు’ అని సీపీ సన్ ప్రీత్‌సిం గ్ వివరించారు. ఇందుకు వీరు మిగితా వారికి 10 నుంచి 30శాతం వరకు కమీషన్ చెల్లించేవారు. ఈ కేసులో 1,080 పత్రాలకు సంబంధించిన లావాదేవీల్లో నిందితులు మోసాలకు పాల్ప డ్డారు.
ఈ కుం భకోణం పై 22 కేసులు.. ఇందులో జనగామలో 7, యాదా ద్రి జిల్లాలో 15 కేసులు నమోదు చేశామని వెల్లడించారు. ఈ ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ పండరి, జనగామ ఇన్‌స్పెక్టర్ సత్యనారయణరెడ్డి, రఘునాథపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డితో ఇతర ఎస్‌ఐలు, సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.
ఇలా ప్రభుత్వ ఆదాయానికి గండి..
ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్ల ద్వారా 3.90కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన కేసులో ప్రధాన నిందితులైన పసునూరి బసవరాజు, జెల్లా పాండు ఇరువురు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఆన్‌లైన్ సర్వీస్ నిర్వహించేవారు. నిందితుల్లో ఒకడైన గణేష్‌కుమార్ తనకు తాను ఆన్‌లైన్ సెంటర్లతో పరిచయం చేసుకున్నాడు. చెల్లించాల్సిన మొత్తాన్ని ఎన్‌ఆర్‌ఐ ఖాతా ద్వారా పే చేస్తానని చెప్పి, రైతుల నుంచి మొత్తం డబ్బులను తమ ముఠాలోని మీ సేవ వ్యక్తుల ద్వారా వసూలు చేయించేవారు. తర్వాత ఆన్‌లైన్ సర్వీస్ వ్యక్తులకు, మధ్యవర్తులకు కమీషన్ చొప్పున డబ్బు అందజేస్తూ ఈ చలాన్‌ను ప్రధాన నిందితుడుకి పంపిచేవాడు.
ఇలా వచ్చిన చలాన్లను బసవరాజు ధరణి, భూభారతి వెబ్‌సైట్లో ‘ఇన్‌స్పెక్ట్’ ఎడిట్ అప్లికేషన్ ఉపయోగించి చలాన్ రుసుం తగ్గించేవాడు. అనంతరం అట్టి చలాన్‌ను మొబైల్ ద్వారా ఎడిట్ చేసి తిరిగి రైతులకు పంపేవాడు. ఇదే క్రమంలో నిందితులు మొబైల్ ఆప్లికేషను ఉపయోగించి, ప్రభుత్వానికి చెల్లించిన రుసుంకు సంబంధించి వెబ్‌సైట్లో జారీ అయిన రసీదులను చెల్లించాల్సిన దాని కంటే తక్కువగా మార్పు చేసేవారు. అనంతరం మార్పు చేసిన రుసుంను మాత్రమే ప్రభుత్వానికి చెల్లించి, నకిలీ చలాన్లను స్థానిక ఎంఆర్‌ఓ/రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మధ్యవర్తుల ద్వారా సమర్పిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ మోసాలకు పాల్పడేవారు.