16-08-2025 07:56:14 PM
పొంగిపొర్లిన వాగులు... నిలిచిన రాకపోకలు...
ప్రాజెక్టుల అన్ని గేట్లు ఎత్తి నీటి విడుదల...
వరదల్లో చిక్కుకున్న ఆరుగురి ప్రాణాలను రక్షించేలా చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్, ఎస్పీ
వరద ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి..
ఆదిలాబాద్ (విజయక్రాంతి): వరుణుడి ప్రతాపానికి ఆదిలాబాద్ నీట మునిగింది. జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో కురిసిన కుండపోత వానతో పలు కాలనీలు, గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. శనివారం ఉదయం ఉరుములు మెరుపులు ఈదురుగాళ్లతో గంటపాటు ఏకధాటిగా దంచి కొట్టిన వానతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. జిల్లా కేంద్రంలోని పలు లోతట్టు ప్రాంతాలతో పాటు కాలనీలు, ప్రధాన రోడ్లు నీట మునిగాయి. ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కారణంగా గుడిహత్నూర్ మండలం సీతగొంది గ్రామంలో ఓ ఇంటిలో గాయక్వాడ్ గణేష్ కుటుంబంలోని సభ్యులు ఆరుగురు చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా(District Collector Rajarshi Shah), జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్(District SP Akhil Mahajan) ఘటన స్థలానికి చేరుకొన్నారు.
హుటాహుటిన డిడిఆర్ఎఫ్ బృందాలను పిలిపించి వరదల్లో చిక్కుకున్న ఓ చిన్నారితో పాటు ముగ్గురు ఆడవాళ్లు, ముగ్గురు మొగవాళ్ళను తాడు సహాయంతో సురక్షితంగా బయటకు తీసి కాపాడారు. ఇచ్చోడ లోని రెసిడెన్షియల్ పాఠశాల చుట్టూ వరద నీరు వచ్చి చేరడంతో పాఠశాలలో విద్యార్థులు చిక్కుకున్న విషయాన్ని తెలుసుకున్న కలెక్టర్ ఎస్పీ ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అదేవిధంగా ఆదిలాబాద్ లో నీట మునిగిన పలు కాలనీలో సైతం కలెక్టర్ ఎస్పీ లు సందర్శించారు. ఆదిలాబాద్ లోని కోజా కాలనీకి చెందిన ఓ వ్యక్తి కార్లో వెళ్తుండగా కాలనీ సమీపంలోని వాగు ఉధృతంగా ప్రవహించడంతో అప్రమత్తమైన ఆయన వెంటనే కారులో నుండి దిగి ప్రాణాలను రక్షించుకున్నారు. వరద ఉధృతికి కారు వాగులో కొట్టుకుపోయింది. మరోవైపు జైనథ్ మండలం తర్ణం వాగులో సైతం 2 లారీలు వరద ఉధృతిలో చిక్కుకుపోయాయి. డ్రైవర్లు క్లీనర్లు సురక్షితంగా బయటపడ్డారు.
ఉగ్రరూపం దాల్చిన కుంటాల వాటర్ ఫాల్...
భారీ వర్షాలతో నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతం, మండలంలోని పొచ్చెర జలపాతం ఉగ్రరూపం దాల్చింది. భారీగా వరద నీరు జలపాతాలకు చేరుకోవడంతో వాటర్ ఫాల్స్ ఉధృతిగా పరవళ్ళు తొక్కుతున్నాయి. దీంతో అధికారులు పర్యాటకుల సందర్శనను నిలిపివేశారు.
ప్రాజెక్టుల అన్ని గేట్లు ఎత్తి నీటినివదిలిన అధికారులు..
ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. జిల్లాలోని సాత్నాల, మత్తడి వాగు ప్రాజెక్టులకు భారీగా ఇన్ఫ్లో పెరగడంతో అధికారులు ముందస్తు జాగ్రత్తగా సాత్నాల ప్రాజెక్టు లోని మొత్తం నాలుగు గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేశారు. అదేవిధంగా మత్తడి వాగు ప్రాజెక్టులో సైతం ఇన్ఫ్లో పెరగడంతో పూర్తిగా ఐదు గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేశారు. దీంతో ప్రాజెక్టు దిగువ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
నీట మునిగిన పంట పొలాలు..
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో వందల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. ముఖ్యంగా పత్తి పంట పెద్దమొత్తంలో నీట మునిగిపోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి...
ఆదిలాబాద్ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని పలు వరద ప్రాంతాల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పర్యటించారు. లోతట్టు ప్రాంతాల్లో నడుమంటి నీటిలో నుంచి నడుచుకుంటూ వెళ్లి ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్(MLA Anil Jadhav) సైతం నియోజకవర్గం లోని పలు వరద ప్రాంతాల్లో పర్యటించారు. పలు ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో బాధితులతో మాట్లాడి వారికి సహాయక చర్యలు చేపట్టేలా అధికారులకు సూచించారు.
ఇచ్చోడలోని రెసిడెన్షియల్ పాఠశాల చుట్టూ వరద నీరు వచ్చి చేరడంతో పాఠశాలలో చిక్కుకున్న విద్యార్థుల వద్దకు నడుం మంటి నీటిలో నడుచుకుంటూ వెళ్లి విద్యార్థులల్లో దైర్యాన్ని నింపారు. అటు మాజీ మంత్రి జోగు రామన్న సైతం వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. లోతట్టు ప్రాంతాలతో పాటు సాత్నాల ప్రాజెక్ట్ ను, అదేవిధంగా నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. వరద బాధితులకు తక్షణ సాహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ను డిమాండ్ చేశారు.