16-09-2025 12:26:41 AM
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: భారత్ - అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపేందుకు అగ్రరాజ్యం అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండెన్ లించ్ భారత్‌కు రానున్నారు. లించ్ మంగళవారం ఉదయం ఢిల్లీ వేదికగా భారత వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్‌తో చర్చలు జరుపనున్నారు. ఈ మేరకు భారత వాణిజ్యశాఖ సోమవారం ప్రకటన విడుదల చేసింది.
ఇరుదేశాల మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ చర్చలు అంతర్జాతీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నదన్న అక్కసుతో భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతం అదనపు సుంకాలు విధించిన తర్వాత, ఇరుదేశాల మధ్య జరిగే మొదటి చర్చలు కావడంతో ఇవే.
వాణిజ్య ఒప్పందాల విషయంలో ట్రంప్ కాస్త మెత్తబడటంతో ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉందని వాణిజ్య విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వాణిజ్య ఒప్పందాలపై ఇటీవల అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ భారత్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు.
జన్యుమార్పిడి మక్కల దిగుమతికి భారత్.. నో..
తమ దేశంలో పండే మొక్కజొన్నను భారత్ కొనుగోలు చేయకపోతే, అమెరికా మార్కెట్‌లోకి ప్రవేశం కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. చైనాతో ఉన్న వాణిజ్య ఉద్రిక్తల కారణంగా అమెరికన్ రైతులు నష్టాలు ఎదుర్కొంటున్నారని, వారికి కొత్త మార్కెట్ అవసరమని లుట్నిక్ వాదించారు. అయితే, భారత్ మాత్రం అమెరికా నుంచి మొక్కజొన్నను దిగుమతి చేసుకునేందుకు సుముఖంగా లేదు.
అమెరికాలో పండే మొక్కజొన్న జన్యుమార్పిడి కావడమే అందుకు కారణం. భారత్‌లో జన్యుమార్పిడి పంటలకు అనుమతి లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తమ వస్తువులపై భారత్ భారీగా సుంకాలు విధిస్తున్నదని, అందుకు ప్రతిగా తాము కూడా భారత్‌పై సుంకాలు పెంచామని ప్రకటించారు. అలాగే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు మొత్తంగా భారత్‌పై 50శాతం సుంకాలు విధించారు.
సుంకాల విధింపుపై భారత్ స్పందిస్తూ.. 50శాతం సుంకాల విధింపు అన్యాయమని, అసంబద్ధమని పేర్కొన్నది. కేవలం దేశియ ఇంధన అవసరాలు, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామని స్పష్టం చేసింది. తాజాగా ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో వాణిజ్య ఒప్పందాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.