15-01-2026 01:56:10 AM
ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ ఇంట పొంగల్ వేడుకల్లో ప్రధాని మోదీ
స్వయంగా పొంగలి వండి సందడి చేసిన ప్రధాని
న్యూఢిల్లీ, జనవరి 14: ఒకప్పుడు భారతీయ సంస్కతిలో అంతర్భాగమైన పొంగల్ నేడు అంతర్జాతీయ పండుగగా అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నూఢిల్లీలోని కేంద్ర మంత్రి ఎల్.మురుగన్ నివాసంలో బుధవారం జరిగిన పొంగల్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కట్టెల పొయ్యిపై పొంగలి వండి అందరినీ ఆశ్చర్యపరిచారు. తర్వాత గోవులకు ఆహారం తినిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రకృతికి, సూర్యభగవానుడికి కృతజ్ఞతలు తెలుపుకోవడమే పండుగ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. తమిళుల సంస్కృతి, జీవనశైలి, ప్రకృతితో వారికన్న అనుబంధానికి ప్రతీక పొంగల్ అని అభివర్ణించారు.
పండుగ కేవలం ఒక్క తమిళనాడుకే పరిమితం కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ సోదర సోదరీమణులు ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రపంచంలోనే అతి పురాతనమైన భాష తమిళం అని గుర్తుచేశారు. తమిళ సంస్కృతిని ప్రేమించే వారిలో తాను కూడా ఒకడినని గర్వంగా ప్రకటించారు. గంగైకొండ చోళపురం ఆలయ సందర్శన జీవితంలో మరచిపోలేని అనుభవమని పేర్కొన్నారు. రామేశ్వరంలో పంబన్ వంతెన ప్రారంభోత్సవం కూడా గొప్ప సందర్భమని అభివర్ణించారు. తమిళనాడుకు చెందిన రైతులు ప్రకృతి సేద్యంలో ఇతర రాష్ట్రాల కంటే ముందంజలో ఉన్నారని, వారిని ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా ఉన్న రైతులు ప్రకృతి సేద్యాన్ని అవలంబించాలని పిలుపునిచ్చారు. నేతల సారవంతం కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంటుందన్నారు.
రైతులే సమాజానికి మూలస్తంభాలని ప్రధాని అభివర్ణించారు. దేశ నిర్మాణంలో అన్నదాతల కృషి వెలకట్టలేనిదని ప్రశంసించారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో రైతులు కీలక భాగస్వాములుగా ఉన్నారని చెప్పారు. వ్యవసాయ రంగంలో యువత ప్రవేశించడం శుభపరిణామమని పేర్కొన్నారు. ముఖ్యంగా తమిళనాడులో యువత సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను వదిలి మరీ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లడం దేశానికే గర్వకారణమని వ్యాఖ్యానించారు. వేడుకల్లో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, రామ్మోహన్‌నాయుడుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ పండుగ అన్నదాతలది!
హైదరాబాద్, జనవరి 14 (విజయక్రాంతి): తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఎక్స్ వేదికగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో రకరకాల సంప్రదాయాలతో ఈ పండగను జరుపుకున్నా అందరినీ కలిపి ఉంచే ఆత్మీయత, ఆనందం మాత్రం ఒక్కటేనన్నారు. ముఖ్యంగా ఈ పండుగ మన అన్నదాతలదని, నిరంతరం శ్రమిస్తూ దేశానికి అన్నం పెట్టే మన రైతు సోదరులకు కృతజ్ఞతలని మోదీ పేర్కొన్నారు. ఈ మకర సంక్రాంతి అందరి జీవితాల్లో కొత్త ఆత్మవిశ్వాసాని నింపాలని, ఎల్లప్పుడూ సానుకూలతతో, ప్రకాశవంతంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాని అన్నారు.