23-11-2025 12:53:16 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో నవంబర్ 22 (విజయక్రాంతి): తెలంగాణ పోలీస్ శాఖలో శనివారం కీలక బదిలీలు జరిగాయి. పరిపాలనా సౌలభ్యం మేరకు పలువురు నాన్ క్యాడర్ ఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ ఈ మేరకు ఆదేశాలిచ్చారు. అయితే, ఈ బదిలీల జాబితాలో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న ‘ఐబొమ్మ’ కేసును పర్యవేక్షిస్తున్న సైబర్ క్రైమ్ డీసీపీ దార కవిత పేరు ఉండటం పోలీసు వర్గాల్లోనూ, రాజకీయంగానూ ఆసక్తికర చర్చకు దారితీసింది.
బదిలీ అయిన అధికారుల వివరాలు
వి.అరవింద్ బాబు: హైదరాబాద్ సీసీఎస్ డీసీపీగా నియామకం.
సుధీంద్ర: హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా బదిలీ.
దార కవిత: ప్రస్తుతం హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీగా ఉన్న ఆమెను వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా బదిలీ చేశారు.వైవీఎస్ సుధీంద్ర: సైబరాబాద్ స్పెషల్ బ్రాంచ్ డీసీపీగా నియామకం.
సాయిశ్రీ: సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీగా బదిలీ
ఎం.రవీందర్ రెడ్డి: గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్‌గా బాధ్యతలు
ఎన్.అశోక్ కుమార్: సీఐడీ ఎస్పీగా బదిలీ
ఇంటెలిజెన్స్ ఎస్పీలుగా పి.కరుణాకర్, ఎస్వీఎన్ శివరామ్, ఆర్.జగదీశ్వర్ రెడ్డిని నియమించారు.
ఐబొమ్మ కేసు వేళ..
ఈ సాధారణ బదిలీల్లో సైబర్ క్రైమ్ డీసీపీ దార కవిత బదిలీ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సినిమా పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు రవి కేసును ఆమె ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు రవి పోలీసు కస్టడీలో ఉండగా, విచారణ అత్యంత కీలక దశలో ఉంది.
పైరసీ నెట్‌వర్క్ మూలాలు, ఆర్థిక లావాదేవీల గుట్టు విప్పుతున్న తరుణంలో, కేసు దర్యాప్తు అధికారిణిని ఆకస్మికంగా వరంగల్‌కు బదిలీ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. ఆమె స్థానంలో కొత్త అధికారి రాకతో కేసు విచారణపై ఎలాంటి ప్రభావం పడుతుందనేది వేచి చూడాలి.