calender_icon.png 23 November, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ వేధింపులు అమానవీయం

23-11-2025 12:55:12 AM

  1. కమీషన్ల కోసం బడా కాంట్రాక్టర్ల బిల్లులు గ్రీన్ చానెల్‌లో విడుదల
  2. రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కన్నీళ్లు కనిపించడం లేదా?
  3. విశ్రాంత ఉద్యోగులను మానసిక ఒత్తిడికి గురిచేయడం దుర్మార్గం
  4. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్

హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యా యులు సర్వీసులో దాచుకున్న సొమ్మును రిటైర్ అయినా తిరిగి ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తుండటం అమానవీయం, అనైతికమని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. మూటలు, కోతలు, వాటాలు, కమీషన్ల గురించి మాత్రమే పనిచేసే సీఎం రేవంత్ రెడ్డికి రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కన్నీళ్లు కనిపించడం లేదా, వేదన వినిపించడం లేదా అని నిలదీశారు.

2024 మార్చి నుంచి రిటైర్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బెనిఫిట్స్ అందక అనేక ఇబ్బందులు ఎదుర్కుంటుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం నెలలు తరబడి ఎదురు చూస్తూ, ఓపిక నశించి వీడియో రూపంలో ఒక విశ్రాంత ఉద్యోగి తన ఆవేదనను వ్యక్తం చేయడంపై హరీశ్‌రావు స్పందించారు. సీఎం రేవంత్‌రెడ్డి కమీషన్ల కోసం బడా కాంట్రాక్టర్ల బిల్లులు గ్రీన్ చానెల్‌లో పెట్టి క్లియర్ చేస్తుంటరు, కానీ విశ్రాంత ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాత్రం విడుదల చేయరని విమర్శించారు.

కమిషన్లు రావని విశ్రాంత ఉద్యోగుల బకాయిలు విడుదల చేయడం లేదా అని ప్రశ్నించారు. 30 ఏళ్లకు పైగా సేవలందించిన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఈ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా, వారి గోడు ఈ ప్రభుత్వానికి పట్టదా అని నిలదీశారు.  విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో రిటైర్డ్ ఉద్యోగులను మానసిక ఒత్తిడికి గురి చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నిర్లక్ష్య పూరిత వైఖరి, పట్టింపులేని తనం వల్ల ఇప్పటికే అనేక మంది విశ్రాంత ఉద్యోగులు మానసిక ఒత్తిడికి గురై ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎం మాటలు నీటి మూటలేనా?

రిటైరైన ఉద్యోగుల బకాయిలు క్లియర్ చేసేందుకు ప్రతి నెలా రూ. 700 కోట్లు విడుదల చేస్తామని చెప్పిన సీఎం మాటలు నీటి మూటలే అయ్యాయని విమర్శించారు. దేశంలోనే విశ్రాంత ఉద్యోగులకు రూ. 10,000 కోట్ల బకాయిలు పెట్టిన రాష్ర్టం ఏదీ లేదని, ఈ ఘనత కూడా రేవంత్ రెడ్డికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. హక్కుగా తాము పొందాల్సిన బెనిఫిట్స్ కోసం విశ్రాంత ఉద్యోగులను ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరిగేలా, పైరవీలు చేసుకోవాల్సిన దుస్థితిని ప్రభుత్వం కల్పించిందని మండిపడ్డారు.

ప్రజలకు హామీ ఇచ్చి నెరవేర్చని జాబితాలో ఉద్యోగుల పీఆర్‌సీ, డీఏలు కూడా చేరటం దురదృష్ట కరమని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయ కుండా ఉద్యోగులను ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని విమర్శించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల ఏమా త్రం ప్రేమ ఉన్నా వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను చెల్లించాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.