02-11-2025 07:22:01 PM
అశ్వాపురం, (విజయక్రాంతి): మొండికుంట నుండి అశ్వాపురం వరకు ఉన్న ప్రధాన రహదారి దుస్థితి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం వేలాది వాహనాలు సంచరించే ఈ రహదారి ప్రస్తుతం గుంతల మయం అయి ప్రమాదాల బాటలో నడుస్తోంది. సిపిఎం పార్టీ మండల నాయకులు దండి రాములు, పెనికేసి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, రోడ్డు పరిస్థితిని అధికారులు ఇప్పటికైనా గ్రహించి వెంటనే స్పందించి రహదారిని కొత్తగా నిర్మించాలి అని డిమాండ్ చేశారు.
రోడ్డు మొత్తం పెద్ద పెద్ద గోతులు ఏర్పడటంతో రాత్రివేళ వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. చాలామంది గోతులు కనిపించక కిందపడిపోవడం వల్ల గాయాలు, వికలాంగత్వం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ అండ్ బి శాఖ తాత్కాలికంగా మట్టి పోయినప్పటికీ, వర్షాల కారణంగా మట్టి అంతా కొట్టుకుపోయి మళ్లీ అదే దుస్థితి నెలకొంది. ఈ రహదారిపై ప్రయాణం చేయాలంటే ఇప్పుడు ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి అని పేర్కొన్నారు. వాహనదారులు ప్రభుత్వానికి లక్షల రూపాయల పన్నులు చెల్లిస్తున్నారని, ప్రజల భద్రత కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని రహదారి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.