09-08-2025 06:27:55 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): తాండూరు మండలం(Tandoor Mandal)లోని నర్సాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోగల లచ్చు పటేల్ గూడలో శనివారం తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తాండూరు మండల కన్వీనర్ పత్రం బాజీరావు జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ తాండూరు మండల కార్యదర్శి దాగం రాజారాం పాల్గొని ఆదివాసీలకు శుభాకాంక్షలు తెలిపారు. వీరు మాట్లాడుతూ ఆదివాసి హక్కుల రక్షణ కోసం అన్ని దేశాలు కృషి చేయాలని కోరారు. 1994 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి ఆగస్టు 9ని ప్రపంచ ఆదివాసి దినోత్సవంగా ప్రకటించిందన్నారు. 1995 నుండి ప్రపంచంలోని అనేక దేశాలలో ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తున్న మన దేశంలో మాత్రం పాలకులు ఆదివాసులను పట్టించుకోవడంలేదని విమర్శించారు.
అనేక పోరాటాల ఫలితంగా వచ్చిన అటవీ హక్కుల చట్టం, 1-/70 చట్టం, దేశ చట్టం 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం ఒక ఆదివాసి తన సాగు భూమి రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ లో ఉన్న హక్కు పత్రం ఇవ్వాలని కోరారు. ఆదివాసుల హక్కుల అభివృద్ధికి పాటుపడాలని చట్టంలో ఉందని దీనిని ఎవరు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసి గిరిజనులను అడవి నుంచి ఖాళీ చేయించి అడవులను కార్పొరేట్లకు కట్టు పెట్టడం కోసం పెద్ద ఎత్తున పుట్ర జరుగుతుందని ఆరోపించారు. జీవో 49 ఆదివాసులకే కాదు జిల్లా ప్రజలకు కూడా నష్టం చేకూరుస్తుందన్నారు. దీనిని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫారెస్ట్ అధికారులు, ప్రభుత్వాలు గిరిజనులపై దాడులు చేస్తే భవిష్యత్తులో పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీలు సోయం జంగు, ఆత్రంజంగు, కొట్నాక శ్యామ్రావు, బుజ్జి రావు, ఆత్రం అనిల్ కుమార్, ఆత్రం జలపతిరావు సోయం పార్వతి రావు, ఆత్రం భీమ్రావు, కేంద్రం కవిత, ఆత్రం జంగు భాయ్, ప్రమీల, లక్ష్మి, సోయం ఈశ్వరి, సోయం అర్జు బాయ్, కురిసింగే జిందర్ సాబ్, సోయం సంతోష్, బొల్లం రాజేశం తదితరులు పాల్గొన్నారు.