calender_icon.png 30 July, 2025 | 7:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కెఓసి బ్లాస్టింగ్ వల్ల నష్టపోతున్న గిరిజనులకు నష్టపరిహారం ఇవ్వాలి

29-07-2025 07:17:22 PM

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రేపాకుల శ్రీనివాస్ డిమాండ్..

టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలం కోయగూడెం ఓసిలో జరిపే బ్లాస్టింగ్ వల్ల, బొగ్గు డంపింగ్ వల్ల కిష్టారం గ్రామంలో ఆదివాసీల ఇండ్లు బీటలు వారి ప్రమాదకరంగా మారిందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రేపాకుల శ్రీనివాస్(CPM District Secretary Group Member Repakula Srinivas) తెలిపారు. మంగళవారం కిష్టారం గ్రామంలో సిపిఎం నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బొగ్గు మసి దుమ్ముతో పంటలు నాశనం అవుతున్నాయని, ప్రజలు అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని ఆయన విమర్శించారు. సింగరేణి సంస్థ కోసం, సాగు భూములతో పాటు, ఆదివాసీల ప్రాణాలు కూడా కోల్పోతున్నారన్నారు.

సింగరేణి సంస్థ మాత్రం భూసేకరణ సందర్భంగా మాయమాటలతో గిరిజనులను మోసం చేశారని ఆయన విమర్శించారు. కిష్టారం గ్రామంలో ఆసుపత్రి నిర్మించాలని అయన డిమాండ్ చేశారు. దుమ్ము ధూళి వల్ల వరి పొలాలు, పత్తి, మిర్చి పంటలు మసిబారిపోతున్నాయని అన్నారు. పంటలు నష్టపోతున్న వారికి నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు, గ్రామం లో చదువుకున్న యువకులకు, భూముల కోల్పోయిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. సాగు భూములు కోల్పోయిన వారికి కొందరికి ఇంకా నష్టపరిహారం, పునరావాసం అందలేదని, వారికి వేంటనే నష్టపరిహారం, పునరావాసం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాబోయే కాలంలో ఈ సమస్యల పరిష్కారానికి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఈసం నర్సింహారావు, మండల కమిటీ సభ్యులు కడుదుల వీరన్న, జోగ దశరథ్, చింత రమేష్ బాబు, జబ్బ రామకృష్ణ, కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.