17-01-2026 04:02:24 AM
వాషింగ్టన్, జవనరి ౧౬: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు 2025లో తనకు వచ్చిన నోబెల్ శాంతి బహుమతిని బహూకరించి వెనిజులా విపక్ష నేత మరియా కొరీనా మచాడో సంచలనం సృష్టించారు. తాజాగా ఆమె వైట్ హౌస్‌లో ట్రంప్‌తో భేటీ అయి, అనంతరం ఆయనకు నోబెల్ పతకాన్ని అందజేశారు. ఒక నోబెల్ విజేత తన పతకాన్ని మరొకరికి స్వచ్ఛందంగా బహూకరించడం చరిత్రలో ఇదే తొలిసారి. వెనిజులా ప్రజల స్వేచ్ఛ కోసం డొనాల్డ్ ట్రంప్ ఎంతో కృషి చేశారని, ఆ కారణంతోనే ఒక అరుదైన బహుమతిని ఆయనకు బహూకరించినట్లు మచాడో ప్రకటించారు. నోబెల్ శాంతి బహుమతిని దక్కించుకోవాలనేది ట్రంప్ చిరకాల వాంఛ.
కాగా, మచాడో మరో రకమైన పద్ధతిలో ఆయనకు నోబెల్ అందజేయడం గమనార్హం. సాధారణంగా ఒకరి పేరుపై ప్రదానం చేసిన నోబెల్ బహుమతిని మరొకరికి బహూకరించడం నిబంధనలకు విరుద్ధం. ఈ విషయాన్ని నార్వే నోబెల్ ఇనిస్టిట్యూట్ ఇప్పటికే స్పష్టం చేసింది. నోబెల్ ఫౌండేషన్ చట్టాల ప్రకారం.. విజేతను మార్చడానికి వీలు పడదని, ఆ బహుమతి శాశ్వతమైనదని స్పష్టం చేసింది. అలాగే బహుమతిని రద్దు చేయడానికి కూడా అవకాశం లేదని తేల్చిచెప్పింది. భౌతికంగా ఉన్న బంగారు పతకం విజేత సొంత ఆస్తి కిందకు వస్తుందని స్పష్టం చేసింది.
నోబెల్‌ను వేలం వేయడం లేదా ఇతరులకు బహుమతిగా ఇవ్వడం విజేత, గ్రహీత వ్యక్తిగత నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడింది. గతంలో కొందరు విజేతలు తమ పతకాలను అనేక స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చారని గుర్తుచేసింది. ట్రంప్ ఇప్పుడు ఆ పతకాన్ని కలిగి ఉన్నప్పటికీ అధికారిక రికార్డుల్లో మాత్రం 2025 నోబెల్ శాంతి బహుమతి గ్రహీతగా మరియా కొరీనా మచాడో పేరు మాత్రమే కొనసాగుతుందని పేర్కొంది.