27-09-2025 01:53:30 AM
-ఒకవైపు ఫ్లైఓవర్ పనులు
-మరోవైపు భారీ వర్షాలతో గుంతలు
-కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా పనులతో సమస్యలు
మేడ్చల్, సెప్టెంబర్ 26(విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లా పరిధిలో 44 వ నెంబర్ జాతీయ రహదారి నరకప్రాయంగా తయారైంది. ఒకవైపు ఫ్లైఓవర్ పనులు, మరోవైపు భారీ వర్షాలతో గుంతల మయంగా మారడంతో ఈ రోడ్డు మీద ప్రాణాలు అరచేతుల పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. 44వ నెంబ రు జాతీయ రహదారి జిల్లా పరిధిలో సుచిత్ర సర్కిల్ నుంచి కాళ్లకల్ వరకు ఉంది. జిల్లా పరిధిలో మొత్తం ప్రమాదకరంగా ఉంది. రద్దీ ఎక్కువగా ఉంటున్నం దున పలు ప్రాంతాల్లో ఫ్లైఓవర్ లు నిర్మిస్తున్నారు.
మరికొన్ని చోట్ల రోడ్డు వెడల్పు చేస్తున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డు మీద ఇప్పటివరకు 40 మందికి పైగా మృత్యువాత పడ్డారు. వాస్తవానికి ఫ్లైఓవర్ పనులు రోడ్డు వెడల్పు చేసిన తర్వాత ప్రారంభించాలి. కానీ చాలా చోట్ల రోడ్డు వెడల్పు చేయకుండానే ఫ్లైఓవర్ పనులు ప్రారంభించడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. అంతేగాక ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నప్పటికీ వాహనాలు వెళ్లడానికి రోడ్డు మరమ్మ తులు చేపట్టాలి. కొంపల్లి నుంచి సుచిత్ర మధ్యలో సర్వీస్ రోడ్డు వేసి రోడ్డు మధ్యలో ఫ్లై ఓవర్ పిల్లర్లు వేస్తున్నారు. మేడ్చల్ మాత్రం ఇరుకు రోడ్డు మధ్యలోనే ఫ్లైఓవర్ పిల్లర్లు నిర్మిస్తున్నారు.
మేడ్చల్ లో మరీ దారుణం
మేడ్చల్ లో జాతీయ రహదారి మరీ దారుణంగా తయారయింది. పట్టణ మధ్య నుంచి ఇరుకు రోడ్డు ఉండడం, పనులు జరుగుతుండడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాదచారులు రోడ్డు దాటడానికి వీలు లేకుండా ఉంది. ప్రస్తుతం పండుగ సీజన్ కావడంతో వాహనాల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. అంతేగాక ప్రతిరోజు వర్షం కురుస్తోంది. దీంతో ట్రాఫిక్ తరచూ నిలిచిపోతోంది. రోడ్డు ఇరువైపులా 75 అడుగులు విస్తరించాలని నిర్ణయించారు. 75 అడుగులు విస్తరించడానికి ప్రైవేట్ ఆస్తులకు పెద్దగా నష్టం జరగడం లేదు.
కొన్నింటికి మాత్రమే నష్టం జరుగుతుండగా అధికారులు ఇదివరకే నోటీసులు జారీ చేశారు. రోడ్డు వెడల్పు చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ కాంట్రాక్టు కంపెనీ నిర్లక్ష్యం చేస్తోంది. భవిష్యత్తులో ఫ్లైఓవర్ పైన స్లాబులు వేసే సమయంలో మరింత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. విస్తరణకు రెండు చోట్ల లీగల్ సమస్యలు ఉన్నాయి. చెక్పోస్ట్ వద్ద యజమానులు, గుండ్ల పోచంపల్లి వద్ద ఐఓసి వారు కోర్టు స్టే తెచ్చుకోవడం వల్ల ఈ రెండు చోట్ల సర్వీస్ రోడ్డు వేయడానికి ఇబ్బంది ఎదురవుతుంది. మిగతా చోట్ల రోడ్డు వెడల్పు చూడండి అవకాశం ఉన్నప్పటికీ చేయడం లేదు.
మందకోడిగా పనులు
రోడ్డు విస్తరణ, పనులు మందకోడిగా సాగుతున్నాయి. పనుల్లో ఇలాగ జాప్యం జరిగితే మరో రెండేళ్లయిన పూర్తయ్య అవకాశం కనిపించడం లేదు. మేడ్చల్, కాళ్లకల్ మధ్యలో రోడ్డు విస్తరణ పనులు కూడా ముందుకు సాగడం లేదు. ఇక్కడ కొన్ని నెలలుగా పనులు నిలిచిపోయాయి. కాంటాక్ట్ కంపెనీకి బిల్లులు సరిగ్గా రానందున పనుల్లో జాప్యం జరుగుతున్నట్లు తెలిసింది.
కాంట్రాక్టర్‌పై చర్య తీసుకోవాలి
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే సమస్యలు ఎదురవుతున్నాయి. నిబంధనలు పాటించకుండా పనులు చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ కూడా లేదు. ఈ రోడ్డు మీద అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. పనులు తొందరగా పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. రోడ్డుమీద గుంతలను పూడ్చి వేయించాలి.
- బొజ్జ వంశీధర్ రెడ్డి, మేడ్చల్ రోడ్డు దాటలేకపోతున్నాం
మేడ్చల్ పట్టణంలో రోడ్డు అధ్వానంగా ఉంది. రోడ్డు ఇరుకుగా ఉండడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతోంది. జాతీయ రహదారికి పట్టణం అటు సగం, ఇటు సగం ఉంది. రోడ్డు దాటాలంటే పెద్ద సమస్యగా ఉంది. రోడ్డు వెడల్పు చేయాలి, గుంతలను పూడ్చాలి.
- కొప్పు నాగరాజు, మేడ్చల్