10-10-2025 01:37:04 AM
-12 నుంచి 15 వరకు జిల్లావ్యాప్తంగా పల్స్ పోలియో
-5.17 లక్షల మంది చిన్నారులకు చుక్కల మందు వేయడమే లక్ష్యం
-జిల్లా కలెక్టర్ హరిచందన
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 9 (విజయక్రాంతి): పోలియో రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా, ప్రతి చిన్నారి ఆరోగ్య భద్రత కోసం తల్లిదండ్రులు రెండు పోలి యో చుక్కలను తప్పనిసరిగా వేయించాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి పిలుపునిచ్చారు. హైదరాబాద్ జిల్లావ్యాప్తంగా ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు పల్స్ పోలియో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడిం చారు.
గురువారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఈ కార్యక్రమ నిర్వహణపై ఆమె అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 0-5 సంవత్సరాల మధ్య వయసున్న 5,17,238 మంది పిల్లలకు పోలియో చుక్కలు అందించడమే లక్ష్యంగా పకడ్బందీ ఏర్పాట్లు చేసిన ట్లు తెలిపారు. ఇందుకోసం 9,36,016 గృహాలను కవర్ చేయనున్నట్లు పేర్కొన్నా రు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 2,843 కేంద్రాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేస్తారన్నారు.
13, 14, 15 తేదీల్లో: వైద్య సిబ్బంది, వాలంటీర్లతో కూడిన 11,200 మంది ఇంటింటికీ తిరిగి, మొదటి రోజు చుక్కలు వేసుకోని చిన్నారులను గుర్తించి, వారికి పోలియో డ్రాప్స్ అందిస్తారన్నారు. నగరంలో 164 హై-రిస్క్ ఏరియాలను గుర్తించి, అక్కడ ప్రత్యేక పర్యవేక్షణతో కార్యక్రమాన్ని అమలు చేయనున్న ట్లు తెలిపారు.అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలలో నివసించే తల్లిదండ్రులు కూడా తమ చిన్నారులను సమీపంలోని పోలియో కేంద్రానికి తీసుకెళ్లి తప్పనిసరిగా చుక్కలు వేయించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటి, డీఎంఓ డాక్టర్ రాములు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.