calender_icon.png 6 May, 2025 | 5:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దోపిడీ కేసుల్లో ఇద్దరు నిందితుల అరెస్ట్

06-05-2025 12:23:19 AM

చేవెళ్ల, మే 05: సీసీఎస్, క్రైమ్ పోలీసులు మూడు దోపిడీ, నాలుగు స్నాచింగ్,  రెండు బెదిరింపు, ఒక ఆటో మొబైల్ దొంగతనం కేసులను ఛేదించి.. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.  చేవెళ్ల డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ సీహెచ్ ఉపేందర్ సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు.  మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం ఇబ్రహీం బాద్ గ్రామంలో నివాసం ఉంటున్న వరంగల్ జిల్లా గూడూర్ మండలం చందూర్ గూడెం గ్రామానికి చెందిన సంపంగి శ్రీనివాస్ అలియాస్ శ్రీను అలియాస్ శివ(35) వృత్తి రీత్యా కూలీ.

ఈజీ మనీకి అలవాటు పడ్డ ఇతను 2015 నుంచి దొంగతనాలు, దోపిడీలు చేయడం మొదలు పెట్టాడు. ఈ ఏడాది కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన పిటాల వెంకటమల్లు(47) ను కూడా తనతో పాటు కలుపుకున్నాడు.  వీరిపై సిద్దిపేట టౌన్, షాద్ నగర్, వనపర్తి, నల్గొండ రూరల్, తొర్రూర్, వికారాబాద్, హుజూర్ నగర్, హాలియా పీఎస్  తో పాటు సైబరాబాద్ పరిధిలోని చేవెళ్ల, నందిగామ, షాద్ నగర్ పోలీస్ స్టేషన్లలోనూ కేసులు నమోదయ్యాయి.   

ఈ కేసులను చాలెంజ్ గా తీసుకున్న చేవెళ్ల క్రైమ్, రాజేంద్రనగర్, శంషాబాద్ సీసీఎస్ బృందాలు నిందితులను  శనివారం(మే3) అరెస్ట్ చేశారు.  విచారణలో భాగంగా నిందితులు నేరాలు చేసినట్లు ఒప్పుకున్నారు.  ఏ1 సంపంగి శ్రీనివాస్ పై గతంలోనే కరీంనగర్, మంచిర్యాల, వరంగల్, రాచకొండ, ఏపీలోని ఎన్ టీఆర్ జిల్లాలో కేసులు ఉన్నాయని, ఒక హత్య కేసు సహా 12 కేసుల్లో ఇదివరకే అరెస్ట్ అయ్యాడని డీఐ తెలిపారు.  ఏ2 పిటాల వెంటమల్లు మాత్రం కొత్త నిందితుడని, వీరిద్దరిని జ్యూడిషియల్ కష్టడీకి తరలించినట్లు వెల్లడించారు.