calender_icon.png 18 January, 2026 | 6:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టీచర్ల మృతి

18-01-2026 01:13:15 AM

మరో ఇరువురికి తీవ్ర గాయాలు

సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం సమీపంలో ఘటన

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), జనవరి 17(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లాలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఉపాధ్యాయురాళ్లు దుర్మరణం చెందగా మరో ఇద్దరు టీచర్లకు తీవ్ర గాయాలయ్యాయి. తుంగతుర్తి నియోజకవర్గంలోని జాజిరెడ్డిగూడెం గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు,అర్వపల్లి ఎస్‌ఐ ఈట సైదులు తెలిపిన వివరాల మేరకు నల్లగొండలో నివాసముండే మామిడాల కల్పన కేజీబీవీ ప్రత్యేకాధికారిగా, పోరెడ్డి గీతారెడ్డి,అలవాల సునీతారాణి, ప్రవీణ్‌లు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరంతా విధి నిర్వహణలో భాగం గా తానంచర్ల - 365 జాతీయ రహదారిపై తుంగతుర్తికి వస్తున్న క్రమంలో జాజి రెడ్డిగూడెం గ్రామ శివారుకు రాగానే కారు బోల్తా కొట్టింది.

దీంతో తుంగతుర్తి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ఎస్‌ఓ కల్పన(43) అక్కడికక్కడే మృతి చెందారు. ఆమెతోపాటు రావులపల్లి ప్రధానోపాధ్యాయురాలు గీతారెడ్డి(48)కీ సైతం తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించింది. అదేవిధంగా తుంగ తుర్తి, అన్నారం ప్రధానోపాధ్యాయులు ప్రవీణ్ కుమార్, సునీతరాణిలకు సైతం తీవ్ర గాయాలు కాగా హైదరాబాద్‌కు తరలించా రు. కారు డ్రైవర్ నడిపల్లి గిరి అతివేగంగా అజాగ్రత్తగా నడపడంవల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు. కాగా తుంగతుర్తి మండలంలోని నాలుగు పాఠశాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. లింగంపల్లి యాదగిరి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సైదులు తెలిపారు. 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఉపాధ్యాయురాళ్లు మృతి చెందడంపై రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందిస్తూ వారి మరణం చాలా బాధాకరమన్నారు. వారి భౌతికకాయాలను సందర్శించి నివాళులర్పించారు. కల్పన ,గీతల కుటుంబ సభ్యుల కు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే గాయపడిన వారు కూడా త్వరగా కోలుకోవాలని పేర్కొన్నారు.