calender_icon.png 26 September, 2025 | 2:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగారం చోరీ కేసులో ఇద్దరు దొంగల అరెస్ట్

26-09-2025 01:15:52 AM

  1. సుమారు రూ.20 లక్షల విలువైన 18 తులాలు బంగారు ఆభరణాలు స్వాధీనం

జిల్లా కేంద్రంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ నరసింహ

సూర్యాపేట, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి) : ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులే టార్గెట్ గా బంగారం చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి నిందితుల నుంచి రూ.20 లక్షల విలువ చేసే 18 తులాల బంగారు అభరణాలు, ఒక కారు, సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహ గురువారం వెల్లడించారు.

2024, ఆగస్టు 18న నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం తుంగతుర్తి గ్రామానికి చెందిన పులిచింతల అరుంధతి జిల్లాలోని మోతె మండలం విభులాపురం గ్రామంలోనీ తన దగ్గరి బంధువుల పెళ్లికి వెళుతూ తన బంగారు ఆభరణాలు ఉన్న హ్యాండ్ బ్యాగ్ తో  సూర్యాపేటలో బస్సు స్టాండ్ లో ఖమ్మం డిపోకు చెందిన బస్సును ఎక్కింది. మరో ఇద్దరు బంధువులతో కలిసి వెళుతున్న క్రమంలో ఎలాంటి అనుమానం రాకుండా ఆమె బంగారు ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించినట్లు తెలిపారు.

దీనిలో ఆరు తులాల నాలుగు లైన్ బంగారపు గాజులు, మూడున్నర తులాల చేతి కంకణాలు, ఐదు తులాల చంద్రహారం, మూడున్నర తులాల బంగారపు నల్లపూసల గొలుసు మొత్తం  చోరీ అయ్యాయని అని ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిందితులను పట్టుకోవడం కోసం మునగాల సర్కిల్స్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, సిసిఎస్ సిబ్బంది ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానంను సద్వినియోగం చేసుకొని నిందితులను గుర్తించి వారి కదలికలపై నిఘా ఉంచారన్నారు.

క్రమంలో బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో సూర్యాపేట, ఖమ్మం జాతీయ రహదారిపై మోతే పోలీస్ స్టేషన్ పరిధిలో మామిళ్ళగూడెం టోల్ ప్లాజా వద్ద మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా హైదరాబాద్ వైపు నుండి  వస్తున్న ఒక కారుని ఆపారన్నారు. ఆ కారులో అనుమాదాస్పదంగా ఇద్దరు వ్యక్తులు ఉన్నారన్నారు.

దీంతో వారిని అదుపులోకి తీసుకోగా వారి వద్ద ఎటువంటి ఆధారాలు లేకుండా సుమారు రూ.20 లక్షల విలువైన 18 తులాల బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయన్నారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకొని పూర్తిస్థాయిలో విచారణ జరపగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా బుద్రాపేట్ గ్రామము కాగా  హైదరాబాద్ లోని అల్మాస్ గుడ్డలో  నివాసం ఉంటున్న గారడి జ్యోతి, అలాగే హైదరాబాదు బడంగ్ పేటకు  చెందిన మహమ్మద్ షేక్ సమీర్  లుగా తమ వివరాలు వెల్లడించారన్నారు.

అదేవిధంగా 2024 ఆగస్టు నెలలో మహిళ నుండి బంగారు ఆభరణాలు దొంగిలించినట్లు ఒప్పుకున్నారన్నారు. అయితే ఈ బంగారంలో ఆంధ్ర ప్రాంతంలో అమ్మేందుకు వెళ్తున్న క్రమంలో పోలీసులకు పట్టుబడినట్లు తెలిపారు. ఈ దొంగతనంలో వీరిద్దరితో పాటు దుర్గ అనే మరో మహిళకు సంబంధం ఉందని ప్రస్తుతం ఆమె పరారీ లో ఉన్నదన్నారు.

ఆమెను కూడా త్వరలో  పట్టుకోనున్నట్లు తెలిపారు. ఈ కేసులో బాగా పనిచేసిన సిసిఎస్ సిబ్బందికి రివారడ్స్ అందించి అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, డిసిఆర్బి  డిఎస్పి రవి, మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, నాటి మోతే ఎస్త్స్ర యాదవెందర్ రెడ్డి, సిసిఎస్ ఎస్‌ఐ హరికృష్ణ, సిసిఎస్ సిబ్బంది ఉన్నారు.