ఆర్టీసీ ఉద్యోగులకు యూబీఐ రూ.10 లక్షల బీమా
ఈ నెల 1 నుంచి సహజ మరణాలకూ వర్తింపు
38వేలకు పైగా కుటుంబాలకు ఆర్థిక భరోసా: ఎండీ
హైదరాబాద్, ఏప్రిల్ 8( విజయక్రాంతి): తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) తీపి కబురు అందించింది. తమ బ్యాంకులో శాలరీ అకౌంట్ కలిగిన ఆర్టీసీ సిబ్బందికి సామాజిక భద్రతను మరింత పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కేవలం ప్రమాదవశాత్తూ జరిగే మరణాలకు మాత్రమే వర్తిస్తున్న బీమా సౌకర్యాన్ని, ఇప్పుడు సహజ మరణాలకు కూడా వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది.
యూనియన్ బ్యాంక్ లో శాలరీ అకౌంట్ కలిగి ఉన్న ఆర్టీసీ ఉద్యోగి సహజంగా మరణించినా, వారి కుటుంబానికి రూ.10 లక్షల ఉచిత బీమా సొమ్ము అందుతుంది. ఈ నూతన నిబంధన 2026, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఈ బీమా కోసం ఉద్యోగులు రూపాయి కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా బ్యాంకే భరిస్తుంది. గతంలో ఉన్న రూ.1 కోటి ప్రమాద బీమా సౌకర్యం యథాతథంగా కొనసాగుతూనే, ఈ సహజ మరణ బీమా అదనంగా చేరింది. ప్రత్యేక సూచనల మేరకు యూనియన్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుందనీ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి అన్నారు.




