calender_icon.png 16 September, 2025 | 9:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విలీనోత్సవమే వీరులకు ఘనమైన నివాళి

16-09-2025 06:56:52 PM

ఇల్లందు (విజయక్రాంతి): సెప్టెంబర్‌ 17ను అధికారికంగా తెలంగాణ విలీన దినోత్సవంగా జరపాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కే సారయ్య(CPI Rashtra Samithi Member Saraiah) అన్నారు. మంగళవారం ఇల్లందు మండలంలోని 21 ఏరియాలోని విట్టల్ రావు విగ్రహం వద్ద సిపిఐ జెండాను కే సారయ్య ఎగరవేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ విలీనదినం కాకుండా వేరే ఏ పేరు పెట్టిన మహత్తర తెలంగాణ సాయుధ పోరాటాన్ని విస్మరించటమే అవుతుందని, రాచరికం రద్దుకై జరిగిన ప్రజా పోరాటానికి మతం, కులం రంగు పులమొద్దన్నారు. నిజాం ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, ఫ్యూడల్‌ ప్రభువుల అణచివేత దోపిడీలకు వ్యతిరేకంగా జరిపిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, మాతృ భాష కోసం, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి, విముక్తి కోసం మట్టి మనుషులు చేసిన తిరుగు బాటు ధిక్కార స్వరం. ‘‘బాంచన్‌ దొర కాల్మొక్త’’ అన్న వెట్టి మనిషి ‘‘దొర ఏందిరో నీ దొరతనం ఏందిరో’’ అంటూ బందూకులు పట్టిన కమ్యూనిస్టు పోరాటమన్నారు.

హైదరాబాద్‌ సంస్థాన రాజు  జమీందార్లు, జాగీర్దార్లు, భూస్వాములు దాదాపు 90 శాతందొరలు నిజాం నవాబుకు గులాములుగా దౌర్జన్యాలతో అనేక మందిని ఊచకోత కోయడం, మహిళలను వివస్త్రలుగా చేసి ఊరేగింపులు చేయడం, బతుకమ్మలు ఆడించడం , మానభంగాలు చేయడం లాంటి క్రూరమైన నేరాలను చేసిన జమీందార్లు, జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌లు హిందువులు  ముస్లిములు ఉన్నారు. అదే విధంగా నిజాం రాజు అరాచకాలకు నిరుపేదలైన మధ్యతరగతి  ముస్లింలు, హిందువులు లక్షలాది మంది పట్టణాలలో కూలి నాలి చేసుకుంటూ ఉండేవారన్నారు. గ్రామాలలో సెంట్‌ భూమి కూడా లేని వ్యవసాయ కూలీలుగా పాలేరుగా అనేక చేతువృత్తులు చేసుకుంటు పంచర్ షాపులలో  లారీలలో క్లీనర్లుగా మెకానికల్ గా భాంచంద్ దొర అంటూ బానిస బ్రతుకులు బతుకుతున్న ఆ బ్రతుకుల్ని చూసి కమ్యూనిస్టు నాయకులు కళ్ళు ఎర్ర చేసి  తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో ఫ్యూడల్‌ వ్యవస్థకు వ్యతిరేకంగా పేద రైతాంగం జరిపిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ముస్లింలు హిందువులు కలిసి చేసిన పోరాటానికి కుల, మతాలకు పూలమడం  త్యాగాలను చరిత్రను అవమానపర్చడమే అవుతుందన్నారు. 

భూమి కోసం, భుక్తి కోసం, దాస్య విముక్తి కోసం చేసిన పోరాటంలో అణగారిన ముస్లిమైనా, హిందులైన నా అన్నదమ్ములేనని అణిచివేసే ఫ్యూడల్‌ ప్రభువును మెడలు వంచి తెలంగాణ ప్రాంతాన్ని విలీనం చేసిన ఘనత కమ్యూనిస్టులదేనని  హిందూవైనా, ముస్లిమైనా వారి వర్గ స్వభావమొక్కటేన్నారు. ఇటువంటి మహోజ్వల పోరాట చరిత్రకు మతం రంగు పులమడానికి ఆనాటి పోరాటంలో ఇసుమంత పాత్ర లేని ఆర్‌ఎస్‌ఎస్‌ గానీ, ఈనాటి బిజెపి గానీ తమ మత ఉన్మాదంతో ఓట్ల రాజకీయాల నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్‌, దాని ప్రతినిధి అయిన బిజెపిలు నేడు మతాలు, కులాలతో సంబంధం లేకుండా  అందరూ ఒక్కటై తమ భూమిని తాము కాపాడుకోవడానికి  వెట్టి చాకిరి నుండి  విముక్తి కావడానికి చేసిన మహత్తర పోరాటానికి మతం రంగు పులమడానికి ప్రయత్నిస్తున్నారు. రజాకార్ల దాడుల్లో హిందూ పురుషులను ముస్లిం మహిళలు, అలాగే ముస్లిం పురుషులను హిందూ మహిళలు తమ కొంగుచాటున దాచిపెట్టి కన్నతల్లులు బిడ్డలను కాపాడుకున్నట్లుగా కాపాడే ఘటనలు ఈ సాయుధ పోరాటంలో ఉన్నాయన్నారు.

అన్నదమ్ముల్లా కలిసి అన్ని మతాల వారు జరిపిన వీరోచిత తెలంగాణ సాయుధ  పోరాటానికి మతం రంగు పులిమే ఎవరైన దేశ భక్తులు ఎలా అవుతారని ప్రశ్నించారు. ముస్లిం రాజు అయిన నిజాం నవాబు అయిన రాజ్యాన్ని పటేల్‌ సైన్యం ఓడిరచి విమోచన చేసినట్లుగా వాదనను చేస్తూ ఈ పోరాటాన్ని  ముస్లీం రాజుకు, హిందూ ప్రజలకు జరిగిన పోరాటంగా  చిత్రీకరించడానికి బిజెపి కుట్రలు చేస్తుంది 4500 మంది కమ్యూనిస్టుల ప్రాణ త్యాగాలతో విలీనం చేసిన తెలంగాణను ఎవరిని చెప్పినా చరిత్ర ఎవరు జరపలేరు కనుకనే ప్రభుత్వం అధికారికంగా విలీన దినోత్సవాన్ని జరపాలని అదే తెలంగాణ సాయుధ పోరాట వీరులకి ఇచ్చే నిజమైన నివాళి అని  సిపిఐ భావిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దేవరకొండ శంకర్, బంధం నాగయ్య, ఇల్లందు పట్టణ మండల కార్యదర్శి బాస శ్రీనివాస్, బొబ్బిశెట్టి సత్యనారాయణ,ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ నజీర్ అహ్మద్ , ఉపాధ్యక్షులు దాసరి రాజారాం, ఉడుత అయిలయ్య, గిరిజన సమాఖ్య రాష్ట్ర నాయకులు గుగులోతు కృష్ణ, వడ్ల శ్రీనివాస్, బొల్లి కొమరయ్య, తాండ్ర లక్ష్మీనారాయణ, ఆలయం రాఘవేంద్రరావు, బాసపాక రవి, ఉబనేశ్వర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.