08-01-2026 01:02:37 AM
ఎక్స్ వేదికగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, జనవరి 7 (విజయక్రాంతి): బడ్జెట్ కేటాయింపుల్లేకుండా రాష్ర్టంలో విద్యావ్యవస్థను ధ్వంసం చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు యూనివర్సిటీల భూములను కాజేయడంపై ‘మిషన్ మోడలో పనిచేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎక్స్ వేదికగా బుధవారం ట్వీట్ చేశారు. మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రైవేటు పరం చేసేందుకు.. అటవీ సంపదను, జీవవైవిధ్యాన్ని లెక్కచేయకుండా ఆ భూమిని చదును చేసేందుకు ప్రయత్నించిందని, దీంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని మొట్టికాయలు వేస్తే వెనక్కు తగ్గిందన్నారు.
ఇప్పుడు గచ్చిబౌలిలోని ప్రఖ్యాత మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ భూములపై కన్నేసిందని, యూనివర్సిటీలోని 50 ఎకరాలను వెనక్కు తీసుకుని మళ్లీ ప్రైవేటుకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసిందని విమర్శించారు. యూనివర్సిటీల వద్ద భూమి ఉంటే.. అది వర్సిటీల భవిష్యత్ అవసరాలకోసం, విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు ఉపయోగపడుతుంది. అంతే తప్ప.. ప్రభుత్వ ఖజానాను నింపేందుకు వీటిని వాడుకోవాల్సిన అవసరం లేదన్నారు. ల్యాండ్ బ్యాంక్ పెంచుకోవడం.. యూనివర్సిటీ భూములను ఆర్థిక దోపిడీకి వాడుకోవడంపైనే రేవంత్ రెడ్డి సర్కార్ ఆసక్తి చూపిస్తోంది.. తప్ప రాష్ర్టంలో విద్యావ్యవస్థ, వర్సిటీల పురోగతిని మాత్రం అంధకారంలోకి నెట్టేస్తోందని పేర్కొన్నారు.