24-07-2025 12:39:55 PM
కాంగ్రెస్ నాయకుల ఆరోపణల పై స్పందించిన ఎమ్మెల్యే
చిత్తశుద్ధి ఉంటే జీవో అంశంపై స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్దామా: ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు సవాల్
కాగజ్ నగర్ (విజయక్రాంతి): మాజీ ఎంపీ సోయం బాబురావు, ఎమ్మెల్సీ దండే విఠల్, డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) పై తన పైన చేసిన ఆరోపణలపై సిర్పూర్ డా.పాల్వాయి హరీష్ బాబు స్పందించారు.గెజిట్ నోటిఫికేషన్ను కేంద్రం అడ్డుకోవాలని మాజీ ఎంపీ సోయం బాబురావు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. గెజిట్ నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తే దాన్ని కేంద్రం ఎలా అడ్డుకుంటుందని ప్రశ్నించారు. పూర్తి సమాచారం లేకుండా మాట్లాడితే ఉన్న గౌరవం కూడా పోగొట్టుకుంటారని హితవు పలికారు.జీవో నెం.49 అమలైతే నేను రాజీనామా చేస్తానని ఎమ్మెల్సీ దండే విఠల్ పేర్కొనడం వారి డొల్లతనాన్ని బయటపెడుతుందని తెలిపారు. నిజంగా జీవో నెం.49 పై చిత్తశుద్ధి ఉంటే ఇదే అంశంపై స్థానిక సంస్థల ఎన్నికల్లో రెఫరెండం పెడదామని, ప్రజలు ఈ జీవో నెం.49ని ఆమోదిస్తున్నారా లేదా అనే విషయం తేటతెల్లం అవుతుందన్నారు.