01-01-2026 12:22:13 AM
జిల్లాలో యూరియా కొరత లేదు: కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్, డిసెంబర్ 31: ఎరువుల యాప్ సర్వర్ డౌన్ కారణంగా యూరియా పంపిణీకి ఇబ్బందులు కలుగుతుండడంతో, రైతులకు రైతు పోర్టల్ డేటాబేస్ ఆధారంగా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా అధికారుల పర్యవేక్షణలో యూరియా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లాలో ప్రైవేటు డీలర్లు, సహకార సంఘాల ఆధ్వర్యంలో యూరియా పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. యూరియా అవసరమైన రైతులు తమ పట్టా పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ పత్రాలతో ఎరువుల వ్యక్రియ కేంద్రం వద్దకు వస్తే, రైతు భరోసా డేటా ఆధారంగా వారికి ఒకటి నుంచి మూడు బస్తాలు పీడియా కేటాయించి, డబ్బులు తీసుకొని ఈపాస్ యంత్రంలో వేలిముద్ర వేయించుకొని పంపిణీ చేస్తున్నారు.
ఎరువుల విక్రయ కేంద్రాలు, రైతు వేదికల వద్ద తొక్కిసలాట తోపులాట జరగకుండా ప్రత్యేకంగా భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. అలాగే రైతులకు తాగునీటి వసతి, నీడ కోసం పలు చోట్ల టెంట్లు ఏర్పాటు చేశారు. రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడకుండా మండల ప్రత్యేక అధికారులు దగ్గరుండి అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. అదనపు కలెక్టర్లతో కలిసి ఆయన మండల స్థాయి అధికారులకు యూరియా పంపిణీ అంశంపై దిశా నిర్దేశం చేశారు. స్వయంగా జిల్లా కలెక్టర్ కూడా ఎరువుల విక్రయ కేంద్రాలను తనిఖీ చేస్తున్నారు. యూరియాకు జిల్లాలో ఎలాంటి కొరతలేదని, యాప్ ద్వారా పంపిణీకి సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల తాత్కాలికంగా పాత పద్ధతిలో రైతులకు యూరియా పంపిణీ చేయాలని సూచించారు.
యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, యాసంగి సీజన్లో పంటలు సాగు చేసిన ప్రతి రైతుకు అవసరమైన యూరియా అందజేస్తామని చెప్పారు. ఎప్పటికప్పుడు యూరియా పంపిణీ, డిమాండు, దిగుమతి అంశాలను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో యూరియా పంపిణీ కార్యక్రమాన్ని మండల ప్రత్యేక అధికారులు, మండల అధికారులు పర్యవేక్షించే విధంగా ఆదేశాలు జారీ చేశారు. అలాగే జిల్లాలోని మండలాల్లో జిల్లా వ్యవసాయ అధికారులతో పాటు ప్రత్యేక అధికారులు, తహసిల్దారులు, ఎంపీడీవోలు, ఏడీ ఏ లు, ఏవోలు, ఏ ఈ వోలు, రెవెన్యూ శాఖ అధికారులు యూరియా పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.