calender_icon.png 23 August, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగట్లో రెట్టింపు ధరకు యూరియా..!

23-08-2025 12:37:27 AM

బ్లాక్ మార్కెట్కు తరలింపు

నడి రోడ్డుపై లారీల్లో యూరియా బస్తాలు

ఒక్కో లారీ నుంచి లక్ష వరకు లాభాలు

పట్టించుకోని అధికారులు

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): పంటలను కాపాడుకునేందుకు యూరియా కోసం తిప్పలు పడుతున్న రైతులకు అధికారులు, ఫర్టిలైజర్ దుకాణదారులు కుమ్మక్కై యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు.  ఒక్కో బస్తా నుంచి 133 రూపాయలు అధికంగా వసూలు చేసి సొమ్ము చేసుకుంటున్నారని రైతులు ఆరోపించారు. ఒక్కో రైతుకు ఎకరాకు రెండు యూరియా బస్తాలు మాత్రమే ఇస్తున్నామని చెప్తున్నా అధికారులు ఏకంగా లారీల కొద్ది యూరియా బయట మార్కెట్లో కనిపించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

శుక్రవారం పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని ప్రధాన రహదారి నడిరోడ్డుపై లారీ నిండా యూరియా బస్తాలను అంగట్లో అత్యధిక ధరకు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. ఈ ఘటన ఒక్కసారిగా అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసినప్పటికీ అధికారులు మాత్రం తమకేమీ తెలియనట్లు వ్యవహరించడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రాథమిక సహకార కేంద్రాల్లో మాత్రం ఒకటి రెండు బస్తాలు మాత్రమే ఇస్తూ బయట మార్కెట్ కు మాత్రం వ్యాపారులకు లారీలకొద్దీ యూరియాను ఎలా ఇచ్చారని సర్వత్ర ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒక్కో బస్తా ధర 267 కాగా ఒక్కో బస్తా 400 రూపాయలు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని ఓ ఫర్టిలైజర్ దుకాణా యజమాని అధికారులతో కుమ్మక్కై యూరియా బస్తాలను లారీల్లో కొద్ది అక్రమార్గాన తరలించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో చేసేది లేక అధిక ధరకే విక్రయించిన పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోయారు.