05-09-2025 11:14:44 PM
గరిడేపల్లి,(విజయక్రాంతి): రైతులకు యూరియా అందించలేని దుస్థితిలో రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుందని, కాంగ్రెస్ పాలనలో రైతులు హరిగోస పడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హుజూర్నగర్ నియోజకవర్గం సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన గరిడేపల్లిలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో రైతులు వ్యవసాయం పండుగలా చేశారని, ముందుగానే 10 లక్షల టన్నుల యూరియా కొనుగోలు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశాడని అన్నారు.
ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో రైతులు యూరియా కోసం రోడ్డున పడుతున్నారని ఆరోపించారు.20 నెలల పాలనలో ప్రభుత్వం ఏం సాధించిందని ప్రశ్నించారు...? రైతుబంధు ఐదు సార్లు ఇవ్వవలసి ఉండగా రెండుసార్లు ఇచ్చారని రైతు బీమా పథకానికి ప్రీమియం చెల్లించకుండా తూట్లు పొడిచారని అన్నారు.బిఆర్ఎస్ ప్రభుత్వం పల్లె ప్రగతికి 23 వందల కోట్లు కేటాయిస్తే నేడు గ్రామాల్లోని పాలన పడకేసిందన్నారు.పోలీసులు శాంతి భద్రతలను వదిలేసి సివిల్ తగాదాలలో తలదూర్చి రాజకీయం చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. పోలీసులు రాజ్యాంగం ప్రకారం డ్యూటీ చేయాలని, తమ తీరు మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. యూరియాను రైతులకు రూ.5 వందలకు బ్లాక్ మార్కెట్ అమ్ముతుంటే వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు అన్నారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని,266 యూరియాను 500 రూపాయలు బ్లాక్లో అమ్ముతుంటే మంత్రి ఉత్తం ఎందుకు స్పందించట్లేదని ఆయన ప్రశ్నించారు...? పోలీసులు అమాయకులపై అక్రమ కేసుల బనాయింపుపై ఎస్.పి కార్యాలయం ముందు ధర్నా చేస్తామని,ఇదే పద్ధతి కొనసాగితే మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.42 శాతం బీసీ రిజర్వేషన్ చట్టబద్ధంగా అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.అనంతరం ఇటీవల మృతి చెందన కొత్తగూడెం గ్రామానికి చెందిన బి.ఆర్.ఎస్ నాయకులు మాజీ సర్పంచ్ నకిరకంటి ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించారు.మృతుడి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.