25-08-2025 11:13:21 PM
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): వినాయక నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వినాయక విగ్రహాల నిమజ్జనానికి సిరిసిల్లలోని మానేరు తీరంలోని ప్రేమ్ నగర్, బ్రిడ్జి వద్ద చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్, ఎస్పీ మహేష్ బి గితే పలు శాఖల అధికారులు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ మాట్లాడారు. వినాయక మంటపాల నిర్వాహకులు తమ విగ్రహాలను భక్తి శ్రద్ధల మధ్య వేడుకలు నిర్వహిస్తూ వైభవంగా తరలించాలని సూచించారు.
ప్రజా ప్రతినిధులు, యువత ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్ళి, వేడుకలను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. వినాయక నిమజ్జనానికి కావలసిన నీటి సౌకర్యం, స్టేజ్, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, పారిశుధ్య పనులు చేయించాలని అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.ఇక్కడ సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, డి.ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, నీటి పారుదల శాఖ అధికారులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.