calender_icon.png 12 October, 2025 | 12:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రధాని మోదీని కలిసిన అమెరికా రాయబారి సెర్గియో గోర్

11-10-2025 08:25:43 PM

న్యూఢిల్లీ: అమెరికా రాయబారిగా నియమితులైన సెర్గియో గోర్ శనివారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ఇద్దరూ రక్షణ, వాణిజ్యం, సాంకేతికతతో సహా ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. వైట్ హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి తాను సంతకం చేసిన ఫోటోను రాయబారి ప్రధానమంత్రికి బహుమతిగా ఇచ్చారు. దానిపై ట్రంప్ "మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, మీరు గొప్పవారు" అని రాశారు. రాయబారితో ఉన్న చిత్రాన్ని పంచుకుంటూ ప్రధానమంత్రి ట్వీట్ చేశారు. భారతదేశానికి అమెరికా రాయబారిగా నియమితులైన సెర్గియో గోర్‌ను స్వాగతించడం ఆనందంగా ఉందని, ఆయన పదవీకాలం భారతదేశం-అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని తను విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు.

సమావేశం తర్వాత గోర్ మాట్లాడుతూ... అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని మోదీని గొప్ప, వ్యక్తిగత స్నేహితుడిగా భావిస్తారని అన్నారు. వాణిజ్యం, రక్షణ, సాంకేతికతతో పాటు కీలకమైన ఖనిజాల ప్రాముఖ్యతలపై కూడా చర్చలు జరిపామని ఆయన వెల్లడించారు. మోదీతో సమావేశానికి ముందు, ఆయన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీలను కూడా కలిశారు.