27-12-2025 01:20:16 AM
న్యూఢిల్లీ, డిసెంబర్ 26: భారత క్రికెట్ లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు ఈ ఏడాది మారుమోగిపోతోంది. మైదానం లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో చెలరేగిపోతున్న వైభవ్ ఇప్పుడు మరో ఘనత సాధించాడు. ప్రతిష్టాత్మక ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అవార్డును అందుకున్నాడు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా వైభవ్ ఈ పురస్కారం తీసుకున్నాడు. చిన్న వయసులోనే క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి నందుకుగానూ వైభవ్కు ఈ అవార్డుకు లభించింది. 14 ఏళ్ల వయసులోనే పలు సంచలన ఇన్నింగ్స్ లతో క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీ ఈ ఏడాది దుమ్మురేపాడు.
ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున వైభవ్ అరంగేట్రం చేశాడు. తద్వారా ఈ లీగ్ లో అతి పిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా నిలిచాడు.ఇక మూడో మ్యాచ్లోనే గుజరాత్ టైటాన్స్‌పై 35 బంతుల్లో నే సెంచరీ సాధించి సంచలనం సృష్టించాడు. తర్వాత ఆసియా కప్ రైజింగ్ స్టార్స్, అండర్ -19 ఆసియాకప్‌లోనూ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ సెంచరీలు చేశాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతి పిన్న వయసులో సెంచరీ చేసిన క్రికెటర్గా రికార్డులకెక్కాడు. తాజాగా విజయ్ హజారే ట్రోఫీలోనూ అరుణాచల్‌ప్రదేశ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బిహార్ తరఫున కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చిన ఈ యువ క్రికెటర్ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నప్పటకీ పలు రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు. కాగా వైభవ్ సూర్యవంశీ సంచలన ప్రదర్శనలతో అతను వచ్చే ఏడాది టీ మిండియాలోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమని పలువురు అంచనా వేస్తున్నారు.