12-07-2025 12:00:00 AM
అదనపు కలెక్టర్ విద్యా చందన
భద్రాద్రి కొత్తగూడెం, జులై 11, (విజయ క్రాంతి):జిల్లాలోవన మహోత్సవ లక్ష్యాలను సాధించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన అన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలంలో శుక్రవారం వన మహోత్సవం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన మండలంలోని పలు గ్రామాలను సందర్శించి వన మహోత్సవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు.
ఈ పర్యటనలో భాగంగా మైలవరం గ్రామంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అని పిలుపు నిచ్చారు. గ్రామంలో రైతు లక్ష్మీనరసు పొలంలో మునగ సాగుకు ప్రోత్సాహం ఇస్తూ మునగ మొక్కను నాటి ప్రారంభం చేశారు.తర్వాత మైలారం గ్రామంలోని జెడ్పిఎస్‌ఎస్ పాఠశాలలో విద్యార్థులతో కలిసి మునగ, వెలగా, ఉసిరి మొక్కలను నాటి విద్యార్థులలో పర్యావరణం పై, ఔషధ మొక్కలపై అవగాహన కల్పించారు.
పాఠశాల ఆవరణంలో నిర్మించిన ‘కమ్యూనిటీ మ్యాజిక్ సోక్ పిట్‘ ను పరిశీలించి, శుభ్రత పట్ల అవగాహన కల్పించే విధంగా దీనిని వినియోగించుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు అందుతున్న పోషకాహారం, వృద్ధి వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మైలవరం గ్రామపంచాయతీ పరిధిలోని నర్సరీను, గట్టుమల్ల నర్సరీలను సందర్శించిన ఆమె మొక్కల లభ్యతను పరిశీలించారు.
ఆయా నర్సరీల్లో వివిధ రకాల మొక్కల నిల్వలు, పంపిణీ విధానాలు, మొక్కల ఆరోగ్యం తదితర అంశాలను సమీక్షించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎంపీ ఓ, పంచాయతీ కార్యదర్శులు, ప్లాంటేషన్ మేనేజర్ రాజు, ఏపీవో, ఈసీ,టిఏ,ఎఫ్‌ఏ గ్రామస్తులు పాల్గొన్నారు.