calender_icon.png 11 May, 2025 | 9:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరదరాజపూర్ సాక్షా కంచినే

08-05-2025 12:07:54 AM

- మళ్లీ విశ్వగురువుగా మారనున్న భారత్

- సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం వరదరాజపూర్‌లో వరదరాజస్వామి యంత్ర పునప్రతిష్ట

- హాజరైన త్రిదండి చిన్న జీయర్ స్వామి, ఎంపీ ఈటల రాజేందర్

- నేడు విగ్రహ ప్రతిష్ట

 గజ్వేల్, మే 7:  వరదరాజపూర్ లో కొలువైన వరదరాజస్వామి సాక్షాత్ కంచిలో కొలువైన వరదరాజస్వామి అని త్రిదండి చిన్న జీయర్ స్వామి అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం వరదరాజపూర్ గ్రామంలో  ప్రభుత్వం పునర్నిర్మించిన  వరదరాజస్వామి ఆలయంలో  త్రిదండి చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా యంత్ర ప్రతిష్ట జరిగింది.

కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో వారు ప్రసంగించారు.  కంచి వరదరాజస్వామిని నిత్యం పూజించుకోలేక బాధపడుతున్న ఆనాటి కొందరు భక్తులు ఆ ప్రాంతం నుంచి వరదరాజ స్వామి విగ్రహాలను తీసుకొస్తున్న క్రమంలో వరదరాజ పూర్ గ్రామంలో సేద తీరారని ఇక్కడ భూమిపై పెట్టిన విగ్రహాలు ఎంతకు కదలకపోవడంతో ఇక్కడే స్వామివారి ఆలయాన్ని నిర్మించారని చిన్న జీయర్ స్వామి తెలిపారు.

వరదరాజ పూర్ లో ఉన్నది సాక్షాత్తు కంచి వరదరాజస్వామియేనని వెల్లడించారు. పూర్తిగా అక్కడి ఆలయం లాగే ఇక్కడి వరదరాజస్వామి ఆలయాన్ని నిర్మించుకోవడం అద్భుతమని, ఇందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరు అభినందనీయులే అన్నారు.  ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ  చిన్న జీయర్ స్వామి లాంటి ఎందరో మహానుభావుల ఆధ్వర్యంలో సనాతన సంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా వెల్లివిరుస్తుందన్నారు. 

అమెరికా అరబ్లాంటి అభివృద్ధి చెందిన దేశాల ప్రజలు కూడా భారతీయ సాంప్రదాయాన్ని ఇష్టపడుతున్నారని చెప్పారు. భారత సంప్రదాయాన్ని వారంతా పాటిస్తూ ఎంతో ప్రశాంతతను పొందుతున్నారన్నారు. ప్రభుత్వాలు ప్రజా ప్రతినిధుల వల్ల ప్రశాంతత లభించదని, సనాతన సాంప్రదాయాన్ని సమాజంలో వెదజల్లుతున్న ఆలయాలలోనే ప్రశాంతత లభిస్తుందన్నారు.

ప్రాచీన కాలంలో ప్రపంచానికి వివిధ శాస్త్రాలను బోధించి విశ్వ గురువుగా పేరుపొందిన భారతదేశం మళ్లీ విశ్వ గురువుగా త్వరలోనే మారనుందన్నారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, కమిటీ సభ్యులు, అధికారులు, వేద పండితులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.