29-10-2025 04:26:41 PM
పత్తి రైతుకు పెను శాపంగా మారిన వరుణుడు.
జిల్లా వ్యాప్తంగా సుమారు 90 వేల ఎకరాల్లో పత్తి పంట సాగు.
రేగొండ/భూపాలపల్లి (విజయక్రాంతి): భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా అధిక విస్తీర్ణంలో సాగుచేసిన పత్తి పంట ఎడతెరిపి లేని వర్షాలకు తీవ్రంగా దెబ్బతిని, అన్నదాతలను మరోసారి అప్పుల ఊబిలోకి నెట్టింది.తొలుత సీజన్ ప్రారంభంలో అనావృష్టితో ఇబ్బంది పడిన రైతన్నకు ప్రస్తుతం అతివృష్టి శాపంగా మారింది. వరుస వానలతో పత్తి క్షేత్రాలు నీట మునగడంతో సుమారు జిల్లా వ్యాప్తంగా 90 వేల ఎకరాల్లో సాగుచేసిన పత్తి పంటకు భారి నష్టం వాటిలినట్లు తెలుస్తుంది.
నీట మునిగిన పొలాలు.. పెరిగిన తెగుళ్ల బెడద.
గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని పత్తి పొలాల్లో వరద నీరు నిలిచిపోయింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, నల్ల రేగడి భూముల్లో పరిస్థితి మరింత దయనీయంగా మారింది.వేరు కుళ్లు ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉండటం వలన పత్తి మొక్కల వేర్లు కుళ్లిపోయి, మొక్కలు వాడిపోతున్నాయి.ఆకు ఎర్ర బారడం అధిక తేమను తట్టుకోలేకపోయిన పత్తి మొక్కలు ఎర్రబారిపోయి ఎదుగుదల నిలిచిపోతుంది.దీనివల్ల పూత,పిందె రాలిపోవడం జరుగుతోంది.కాయ కుళ్లు వర్షాల ధాటికి కాయలు మురిగిపోయి కాయ కుళ్లు తెగులు సోకుతోంది. చేతికి అందాల్సిన 'తెల్ల బంగారం' పత్తి కాయల్లోనే కుళ్లి నల్లగా మారుతోంది.గడ్డి పోటు వానల కారణంగా పొలాల్లో కలుపు (గడ్డి) విపరీతంగా పెరిగిపోయి,పత్తి మొక్కలకు పోషకాలు అందకుండా ఆటంకం కలుగుతుంది.
లక్షల్లో పెట్టుబడి... అంచనాల్లేని నష్టం.
గత రెండేళ్లుగా మిర్చి సాగులో తీవ్ర నష్టాలు చవిచూసిన రైతులు ఈ ఏడాది పత్తి సాగుకు మొగ్గు చూపారు. ఎకరాకు రూ. 25 వేల నుంచి రూ.50 వేల వరకు పెట్టుబడి పెట్టి, మంచి దిగుబడి వస్తుందని ఆశించిన రైతులకు ఈ వర్షాలు కోలుకోలేని దెబ్బ తీశాయి.మూడుసార్లు నీట మునగడంతో పూత, కాయ నేల రాలి, చిగుర్లు ఎండిపోయాయి.కష్టాలకో నష్టాలకో అంతో ఇంతో పండిన పత్తిని వేరుకుని అమ్ముకుందాం అనే సరికి ఈ వానలతో నోటికాడికి వచ్చిన పంట నీటి పాలవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
నివారణ చర్యలు చేపట్టాలి.
రేగొండ మండల వ్యవసాయ అధికారి పెద్ది వాసుదేవా రెడ్డి.
నీట మునిగిన పత్తి పంటకు తక్షణమే తెగుళ్లు సోకే ప్రమాదం ఉందని దీంతో రైతులకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. మురుగు నీటి తొలగింపు: పొలాల్లో నిలిచిన నీటిని తక్షణమే మురుగు కాలువల ద్వారా బయటకు పంపేలా చూడాలి. ఎరువుల యాజమాన్యం: వర్షాలు ఆగిన తర్వాత పత్తి మొక్కలకు తగిన పోషకాలు అందించాలి. ఆకు ఎర్రబారడం నివారణకు: 19:19:19 కాంప్లెక్స్ ఎరువును లీటరు నీటిలో 10 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
వేరుకుళ్లు తెగులు నివారణకు: వర్షాలు తగ్గిన తర్వాత పొటాషియం నైట్రేట్ (10 గ్రాములు) లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ (3 గ్రాములు)ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పర్యవేక్షణ: పొలంలో గడ్డి నియంత్రణకు చర్యలు చేపట్టి,తెగుళ్ల ఉధృతి ఎక్కువగా ఉంటే వ్యవసాయ అధికారులను సంప్రదించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. పత్తిని ఆరబెట్టడం: తీసిన పత్తిని తగినంత ఎండ ఉన్నప్పుడే తీయాలి.తడిగా ఉన్న పత్తిని వెంటనే గాలి తగిలే ప్రదేశాల్లో బాగా ఆరబెట్టి,తేమ 8%(శాతం) కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి.అలాగే ఇంకా రేగొండ లో వరి పొలాలు కోత దశకు రాలేదు.ఒకవేళ వచ్చినా వర్షాలు పూర్తిగా తగ్గు ముఖం పట్టాకనే కోతలు తీయాలి.
అన్నదాతల విజ్ఞప్తి..
ప్రభుత్వం తక్షణమే జిల్లా వ్యాప్తంగా దెబ్బతిన్న పత్తి పంటను పరిశీలించి, నష్ట పరిహారం అందించి రైతులను ఆదుకోవాలని జయశంకర్ భూపాలపల్లి రైతులు డిమాండ్ చేస్తున్నారు.