24-05-2025 12:53:05 AM
అఖిల భారత సర్వోదయ మండలి మేనేజింగ్ ట్రస్టీ మహాదేవ్ విద్రోహి
వెదిరె రామచంద్రారెడ్డి భూదానం భారత చరిత్రలో మైలురాయి
అఖిల భారత సర్వోదయ మండలి జాతీయ అధ్యక్షుడు వెదిరె అరవింద్‌రెడ్డి
ముషీరాబాద్,(విజయక్రాంతి): వంద ఎకరాలు భూమిని దానం చేసి భూదాన ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన వెదిరే రామచంద్రారెడ్డికి ’పద్మ విభూషణ్’ అందజేయాలని అఖిల భారత సర్వోదయ మండలి మేనేజింగ్ ట్రస్టీ మహాదేవ్ విద్రోహి అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలనీ అలాగే ట్యాంక్ బ్యాండ్‌పై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి, పాఠ్యాంశాల్లో ఆయన జీవిత చరిత్రను చేర్చి, ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం ’భూదాన ఉద్యమ ప్రా ముఖ్యత-గతం, వర్తమానం-వేదిరె రామచంద్ర రెడ్డి భూదాన ఉద్యమ స్థాపకుడు’ అనే అంశంపై తెలంగాణ సర్వోదయ మండలి ఆధ్వర్యంలో సదస్సు జరిగింది.
ఈ సందర్బంగా మహాదేవ్ విద్రోహి మాట్లాడుతూ.. పేదలకు భూమిని దానం చేసిన మొదటి భూస్వామి వెదిరె రామచంద్ర రెడ్డి అని, భూస్వాములను పేదలకు స్వచ్ఛందంగా భూమిని దానం చేయమని ప్రోత్సహించి, భూదాన ఉద్యమాన్ని ప్రారంభించడానికి ప్రేరేపించడం దేశానికి స్ఫూర్తి దాయకమైయిందన్నారు. అప్పటినుండి ఆచార్య వినోబాభావే శాంతి యాత్ర భూదా న ఉద్యమంగా మారిందని, పోచంపల్లి భూదాన పోచంపల్లిగా మారడానికి కారణం వెదిరె రామ చంద్రారెడ్డి అని అనంతరం తనకున్న దాదా పు 12 వందల ఎకరాలను కూడా భూదాన ఉద్యమంలో దానం చేశారని తెలిపారు. వెదిరె రామచంద్రారెడ్డి భూదాన స్పూర్తితో తెలంగాణాలో దాదాపు 2 లక్షల ఎకరాలు, దేశ వ్యాప్తంగా దాదాపు 45 లక్షల ఎకరాలు సేకరించబడి, పేదలకు దానం చేయబడిందని చెప్పారు.
అఖిల భారత సర్వోదయ మండలి జాతీయ అధ్యక్షులు వెదిరె అరవింద్ రెడ్డి మాట్లాడుతూ శాంతి యాత్రలో భాగంగా పోచంపల్లికి చేరిన ఆచార్య వినోబాభావే కోరిక మేరకు 100 ఎకరాలను దానం చేశాడని అన్నారు. ఈ ఘటనతో స్ఫూర్తి పొందిన వినోబా భావే దేశవ్యాప్త భూదాన ఉద్యమానికి భూదాన జ్యోతిని ఈ ప్రాంతంలోనే వెలిగించాడని అన్నారు. అనంతర కాలంలో నెహ్రూ, జయప్రకాశ్ నారాయణ, బాబు రాజేంద్రప్రసాద్, వివి గిరి వంటి మహనీయులు పోచంపల్లిని సందర్శించినప్పుడు తనకున్న యావదాస్తిని పేదల కోసం దానమిచ్చాడని అన్నారు. ఇలా ఆయన దాదాపు 1200 ఎకరాల భూమి దానం చేసాడని గుర్తు చేసారు. వెదిరె రామచంద్రారెడ్డి భూదానం భారత చరిత్రలో మైలు రాయి అని, నేడు భూదాన భూములు అన్యాక్రాంతం అవుతున్నందునకు ఆందోళన చెందుతున్నామని తెలిపారు.
భూదాన భూమి ప్రభుత్వ భూమి కాదని పేదల కోసం మహనీయుడు రామచంద్రారెడ్డి అందజేసిన భూమిగా చెప్పారు. ఈ స్ఫూర్తితోనే దేశవ్యాప్తంగా వినోబాభావే లక్షల ఎకరాలను సేకరించారని తెలిపారు. అటువంటి మహనీయుని త్యాగచరితను రాష్ట్ర ప్రభు త్వం గుర్తించి గౌరవించాలన్నారు. ఆయనకు దక్కే గౌరవం రాష్ట్రానికి దక్కే గౌరవంగా నిలిచిపోతుందని వెదిరె అరవింద్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు తోలుపునురి కృష్ణ గౌడ్ మాట్లాడుతూ అన్యాక్రాం తమైన భూ దాన భూములని కాపాడాలని, రాష్ట్రంలో భూదాన యజ్ఞ బోర్డు ఏర్పాటు చేసి మిగిలిఉన్న భూదాన భూములను పేదలకు పంపిణి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. భూదాన్ రామచంద్రారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు డా.వెదిరె ప్రబోధ్ చంద్ర రెడ్డి, ప్రమోతిష్ చంద్ర రెడ్డి, తెలంగాణ సర్వోదయ మండలి నేత టి.నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.