09-09-2025 12:14:37 AM
-చాకలి ఐలమ్మ విగ్రహా విష్కరణకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శంకర్
-పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, బిజెపి నేత ఆచారి
కడ్తాల, సెప్టెంబర్ 8 : దేశంలో కొందరు మహనీయులు స్వతంత్ర పోరాటం కోసం రంగంలోకి దిగితే, కొందరు సామాజిక న్యాయం కోసం పోరాటం చేశారని, అలాం టి వారిలో వీరనారి ఐలమ్మ కూడా ఒకరిని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. సోమవారం కల్వకుర్తి నియోజకవర్గంలోని రావిచేడు గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చాక అసమానతలు లేని ప్రపంచాన్ని సృష్టించేందుకు మహాత్మా గాంధీ కన్నకలలను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నిజం చేశారని గుర్తు చేశారు.
ఇలాంటి మహానుభావులను నిత్యం తలుచుకొని వారిని పూజించాలని అన్నారు. చాకలి ఐలమ్మ త్యాగాలు మరువలేనివని, బడుగు వర్గాల ఉన్నతికి ఆమె ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. సేవా తత్పరతకు, త్యాగ నిరతికి కులాలు, మతాలతో సంబంధం ఉండదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. తనను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ ఆనాటి చాకలి ఐలమ్మ కాలం నుంచి నేటిదాకా దేశం కోసం నడుము కట్టిన మహిళా మండలి ఎందరో ఉన్నారని అన్నారు.
చట్టసభలలో 33 శాతంమహిళా రిజర్వేషన్ అమలు తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన డిమాండ్ చేశారు. వీర్లపల్లి శంకర్ ఎమ్మెల్యేగా కష్టపడి పని చేస్తున్నారని, ఏ అవసరం ఉన్న నేరుగా ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి మాట్లాడి అభివృద్ధి వైపు అడుగులు వేస్తారని అన్నారు. బిజెపి నేత ఆచారి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల విషయంలోనైనా, ఇతర ఏ సంక్షేమ పథకాలలోనైనా బీసీలకు జనాభా దామా షా ప్రకారం న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, స్థానిక ఎమ్మెల్యే ఎందుకోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రతి పోరాటంలోనూ బీసీల పాత్ర ఉందని, కానీ ప్రతి చోటా బీసీలు వెనుకబడి ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల భవిష్యత్తు కోసం నిరంతర పోరాటం చేస్తానని ఆయన స్పష్టం చేశారు. జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి మాట్లాడుతూ చాకలి ఐలమ్మ లాంటి వీరవనితలు తెలంగాణ గడ్డ కన్నదని అలాంటి తల్లుల స్ఫూర్తితో రాజ్యాధికారం దిశగా మనమంతా అడుగులు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. మండలంలోని వివిధ పార్టీల నేతలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.