06-10-2025 12:23:26 AM
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ట్యాంక్‌బండ్‌పై కాకా జయంతి
హాజరైన మంత్రులు పొన్నం, శ్రీధర్‌బాబు, వివేక్, వాకిటి శ్రీహరి
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 5 (విజయక్రాంతి): బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు కాకా (గడ్డం వెంకటస్వామి) అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు కొనియాడారు. చిన్ననాటి నుంచే సమాజ సేవకు అంకితమై, కార్మికులు, పేదల పక్షాన నిరంతరం పోరాడిన యోధుడని స్మరించుకున్నారు. కాకా 96వ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా అదివారం ట్యాంక్‌బండ్‌పై ఉన్న ఆయన విగ్రహానికి భట్టి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ర్ట, కేంద్ర మంత్రిగా, ఉమ్మడి ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీకి, ప్రజలకు కాకా చేసిన సేవలు చిరస్మరణీయం అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం ఆయన ప్రత్యేకంగా తెచ్చిన చట్టాలు, చేపట్టిన కార్యక్రమాలు సమాజంలోని తాడిత, పీడిత వర్గాలకు ఎంతో మేలు చేశాయన్నారు. తొలి, మలి దశ తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమంలోనూ ఆయన పోరాటం మరువలేనిదని గుర్తుచేశారు.
వెంకటస్వామి ఆశయాలను, ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తూ సమాజ సేవకు మనమందరం పునరంకితం కావడమే ఆయనకు మనం అర్పించే ఘనమైన నివాళి అని భట్టి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, కాంగ్రెస్ రాష్ర్ట వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, సరోజా వివేక్ కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.