06-10-2025 12:25:10 AM
అగ్రకులాలకు లేని రిజర్వేషన్ సీలింగ్.. బీసీ కులాలకు ఎలా?
బీసీ బిల్లుపై కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది
బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టులో వాదనలకు సీనియర్ న్యాయవాదులను ప్రభుత్వమే నియమించాలి
రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
ఖైరతాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాంతి) : రాజ్యాంగబద్ధంగా రావలసిన బీసీల వాటాను వ్యతిరేకిస్తే సహించబోమని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధించేంత వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.
బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు కోల జనార్దన్, గుజ్జ కృష్ణ అధ్యక్షతన ఆదివారం అఖిలపక్ష పార్టీల ప్రతినిధులు, బీసీ సంఘం నాయకులు సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేసిన కేసులపై భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య,
మంత్రి వాకటి శ్రీహరి, మాజీమంత్రి గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మల్కా కొమరయ్య శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, రాపోలు ఆనంద్ భాస్కర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర పభుత్వం బీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి సొంతంగా చట్టాలు చేసే అవకాశం లేనందునే ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి బిల్లు పంపించినట్లు తెలిపారు. బిల్లు పంపించి ఐదు నెలలు గడుస్తున్నా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. అనంతరం సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో వాదించేందుకు సీనియర్ న్యాయవాదులను ప్రభుత్వమే నియమించాలని కోరారు.
కొంతమంది బీసీ రిజర్వేషన్‌పై గిట్టని వారు 50% సీలింగ్ ఉందని చెప్పి ప్రజల్లో ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. అగ్రకులాలకు లేని రిజర్వేషన్ సీలింగ్.. బీసీ కులాలకు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుడు చెరుకు సుధాకర్, మాజీ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య, పుట్ట మధు పాల్గొన్నారు.