16-08-2025 12:24:00 AM
విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో మరో చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఈ సినిమాను వీరిద్దరూ ఎట్టకేలకు కొబ్బరికాయ కొట్టేశారు. వెంకటేశ్ నటిస్తున్న ౭౭వ సినిమా ఇది. హైదరాబాద్‌లో శుక్రవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
స్వచ్ఛమైన వినోదం, లోతైన భావోద్వేగాలతో నిండిన కుటుంబ కథా చిత్రాలను అందించడంలో త్రివిక్రమ్ పేరుగాంచారు. అలాంటి త్రివిక్రమ్ ప్రత్యేకమైన కథా శైలి ద్వారా రూపుదిద్దుకున్న పాత్రలో వెంకటేశ్‌ను చూడటం ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతిని అందించనుంది. హారిక క్రియేషన్స్ పతాకంపై నిర్మాత ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మించనున్న ఈ సినిమా త్వరలో చిత్రీకరణ ప్రారంభించుకోనుంది. శుక్రవారం జరిగిన పూజా కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత సురేశ్‌బాబు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, నిర్మాత సూర్యదేవర నాగవంశీ తదితరులు పాల్గొన్నారు.