calender_icon.png 5 October, 2025 | 7:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీజీపీ శివధర్‌రెడ్డి ముందు..వేణుగోపాల్ లొంగుబాటు?

05-10-2025 01:21:53 AM

హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): మావోయిస్టులకు మరో భారీ షాక్ తగిలింది. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ తెలంగాణ డీజీ పీ శివధర్‌రెడ్డి ఎదుట తన అనుచరులతో కలిసి లొంగిపోయినట్లు తెలుస్తున్నది. గత కొన్ని నెలలుగా మావోయిస్టుల అణచివేతకు భద్రతా బలగాలు అడవులను జల్లెడపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనేక మంది మావోయిస్టులు భద్రతా బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు.

వారిలో మావోయిస్టు పార్టీ అగ్రనేత కిషన్‌జీ కూడా ఉన్నారు. కిషన్‌జీ సోదరుడైన మల్లోజుల వేణుగోపాల్ ఇప్పుడు పోలీసుల ఎదుట తన అనుచరులతో కలిసి లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీకి భారీ షాక్ తగిలిందని చెప్పవచ్చు. అయితే కొన్ని రోజులుగా మావోయిస్టు పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయినట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలో పార్టీ ని కాపాడేందుకు, సభ్యులను కాపాడేందుకు తాము ఆయుధాలను వీడేందుకు సిద్ధంగా ఉన్నామని మల్లోజుల వేణుగోపాల్ పేరున లేఖ కూడా విడుదలయింది.

తాము ఆయుధాలను వీడటంలేదంటూనే మల్లోజుల వేణుగోపాల్ ద్రోహి అంటూ మావోయిస్టులు మరో లేఖను విడుదల చేశారు. ఈ లేఖలనుబట్టి మావోయిస్టులు రెండు వర్గాలుగా చీలిపోయారని తెలుస్తున్నది. అంతేకాకుండా మల్లోజుల వేణుగోపాల్ కోవర్టుగా మారి పోలీసులు మావోయిస్టుల సమాచారాన్ని చేరవేస్తున్నాడనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.