13-10-2025 06:53:37 PM
జయశంకర్ భూపాలపల్లి జిల్లా డీఎస్పీ సంపత్..
చిట్యాల (విజయక్రాంతి): బాధితులు, ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా డీఎస్పీ సంపత్ అన్నారు. సోమవారం మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను వార్షిక తనిఖీలో భాగంగా జిల్లా ఎస్పీ కిరణ్ కిరణ్ ఖరే ఆదేశాల మేరకు ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల ఫిర్యాదుల విషయంలో వెంటనే స్పందించి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. సిబ్బంది పనితీరు, నమోదు చేయబడిన కేసుల్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్, ప్రజలతో, ఫిర్యాదుదారులతో ఎలా ప్రవర్తిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. రికార్డులను తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న నేరాలు, తదితర అంశాలను ఎస్‌ఐని అడిగి తెలుసుకున్నారు.
పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాలు గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. గంజాయి, మత్తు పదార్థాల సరఫరా, విక్రయం, అక్రమ రవాణా, సేవించడం వంటి వాటిపై, అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. రోడ్డు ప్రమాద కేసులను పెండింగ్‌లో ఉంచకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో చిట్యాల సిఐ దగ్గు మల్లేష్ యాదవ్, ఎస్సై బోరగల అశోక్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.