02-08-2025 11:03:44 PM
ఉద్రిక్తత మధ్య రేషన్ కార్డుల పంపిణీ
సీఎం ఫెక్సీకి పాలాభిషేకాన్ని అడ్డుకున్న బీఆర్ఎస్
బీఆర్ఎస్ నాయకులపై కేసు
సంగారెడ్డి,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా హత్నూర మండల కేంద్రంలో నూతన రేషన్ కార్డులు, షాదీముబారక్, కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకొని ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పలువురు కార్యకర్తలను అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే..హత్నూరలోని రైతువేదికలో అధికారులు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డితో పాటు బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు.
కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ఫెక్సీకి పాలాభిషేకం చేయడానికి కాంగ్రెస్ కార్యకర్తలు ఉపక్రమించగా బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పాలాభిషేకం చేయకుండా సీఎం ఫెక్సీని తొలగించే ప్రయత్నం చేయగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా వేదిక గందరగోలంగా మారిపోయింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు నినాదాలు, విమర్శలు చేసుకున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఎలాంటి గొడవ జరగకుండా నాయకులను చెదరగొట్టారు. కాగా సీఎం ఫెక్సీని బీఆర్ఎస్ నాయకులు చించివేశారని హత్నూర పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేయడంతో పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేసి సాయంత్రం వదిలివేశారు.
కాంగ్రెస్ నాయకుల గరంగరం...
ప్రభుత్వ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఫెక్సీకి పాలాభిషేకం చేస్తే తప్పేంటని, బీఆర్ఎస్ నాయకుల ఆగడాలపై నర్సాపూర్ నియోజకవర్గ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నియోజకవర్గ పార్టీ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల సుహాసినీరెడ్డితో పాటు పలువురు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఫెక్సీని చించిన వారిపై కేసు పెట్టినప్పుడు వారిని ఎందుకు విడిచిపెట్టారని ప్రశ్నించారు. దీంతో పోలీస్ స్టేషన్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారిక కార్యక్రమాల్లో సీఎం ఫెక్సీకి పాలాభిషేకం చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. మీరు ఎమ్మెల్యేకు తొత్తులుగా పనిచేస్తున్నా అంటూ నిలదీశారు. దీంతో పోలీసులు వారిపై చర్యలు తీసుకుంటామని హామీనివ్వడంతో వెళ్ళిపోయారు.