బారా ‘లోన్’ మాఫ్!
బ్యాంకింగ్ రంగ నిబంధనలు డొల్ల
- కార్పొరేట్ శక్తుల విషయంలో ఎనలేని ఉదారత
- బడాబాబుల వేల కోట్ల రుణాలు ఒక్క సంతకంతో మాఫీ
- పేదోడి క్లెయిమ్స్‌కు మాత్రం కొరకరాని కొర్రీలు
- అందుకు చక్కటి ఉదాహరణే.. ఒడిశా ఘటన
- నామినీ సొమ్ము కోసం అక్క ఆస్థిపంజరాన్ని మోసుకెళ్లిన కూలీ జీతూ
హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): ‘అన్నపు రాశులు ఒకచోట.. ఆకలి మంటలు ఒకచోట.. హంస తూలికలు ఒకచోట.. అలసిన దేహాలు ఒకచోట..’ అంటాడు ప్రజాకవి కాళోజీ నారాయణరావు. రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేదల జీవితాలను, కోట్లకు పడగలెత్తిన బడాబాబుల జీవితాల మధ్య వ్యత్యాసాన్ని కవి చాచిపెట్టి కొట్టినట్లు చెప్పిన కవిత అది. ఈ దేశంలో పేదలకు, పెద్దలకు ఒక రూల్ అని చట్టం చెబుతుంది.
ఆచరణలో మాత్రం.. లంచమో గించమో ఇస్తే బడాబాబులకు చట్టం చుట్టమవుతుంది. కానీ.. పేదవాడికి న్యాయంగా దక్కాల్సిన హక్కు కూడా చచ్చీచెడి, వ్యవస్థల కాళ్లుమొక్కి సం పాదించుకోవాల్సి ఉంటుంది. అందుకు తాజా ఉదాహరణే ఒడిశాలోని కియోంజర్ జిల్లాలో చోటుచేసుకున్న ఘటన. రూ. 20 వేల కోసం ఓ కూలీ తన అక్క అస్థిపంజరాన్ని భుజాన వేసుకుని బ్యాంక్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. నిరక్షరాస్యుడైన ఆ పేదవాడు బ్యాంకర్ల కొర్రీలకు చివరకు శ్మశానాన్ని తవ్వాల్సి వచ్చింది.
జీతూ ముండా నిరుపేద కూలీ. వయస్సు ౫౦ ఏళ్లు. సోదరి కాల్రా ముండా (౫౬) అనారోగ్య సమస్యలతో జనవరి 26న మర ణించింది. ఆమె బతికి ఉన్న కాలంలో కూలినాలి చేసుకుని సంపాదించిన రూ. 20 వేల సొమ్మును తన బ్యాంకు ఖాతాలో దాచుకున్నది. బ్యాంకు ఖాతాకు నామినిగా తన సోదరుడు జీతూను నమోదు చేయించి ఉన్నది. ఈ విషయం తెలుసుకున్న జీతూకు కొంత ఊరడింపు లభించింది. రెక్కాడితే కా ని డొక్కాడని కుటుంబానికి ఆ సొమ్ము ఎం తో ఆసరా అవుతుందని జీతూ భావించాడు.
కనికరించని బ్యాంకర్లు..
బ్యాంకుకు వెళ్లి తన సోదరి మృతిచెందిందని బ్యాంకు అధికారులకు తెలిపాడు. బ్యాంకు ఖాతాకు సంబంధించిన వివరాలను అందించాడు. బ్యాంకు అధికారులు ఈ ధ్రువపత్రం తీసుకురా? ఆ ధ్రువపత్రం తీసుకురా? అంటూ రోజుల పాటు వేధింపులకు గురిచేశారు. నిరక్షరాస్యుడైన జీతూ తన శక్తియుక్తులన్నీ ఉపయోగించాడు. అయినప్ప టికీ పత్రాలు సాధించలేకపోయాడు. బ్యాం కర్ల కాళ్లావేళ్ల పడి తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు.
తాము సూచించిన విధంగా పత్రాలైనా తీసుకురావాలని లేదం టే చనిపోయిన సోదరినైనా తీసుకురావాలంటూ తెగేసి చెప్పారు. చివరకు చేసేదేం లేక జీతూ సీదా శ్మశానానికి వెళ్లాడు. తన అక్క అస్థిపంజరాన్ని భుజాన వేసుకున్నాడు. ఎర్రటి ఎండలో కొన్ని కిలోమీటర్ల నడిచి బ్యాంక్‌కు వెళ్లాడు. తన అక్క అస్థిపంజరాన్ని చూపించి ‘నా సోదరి మరణించింది’ అనడానికి ఇంతకంటే తన వద్ద వేరే సాక్ష్యం లేదని చెప్పి నిస్సహాయత వ్యక్తం చేశాడు.
ఈ హృదయ విదారక ఘటన సోమవారం చోటుచేసుకోగా, మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. సోషల్ మీడియాలో ఆ ఫొటోలు వైరల్ కాగా ఒడిశా ప్రభుత్వం స్పం దించింది. బ్యాంక్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జీతూకు అందించాల్సిన సొమ్మును తక్షణం విడుదల చేయాలని ఆదేశించింది. అంతేకాదు.. పోలీసులే దగ్గరుండి తిరిగి అస్థిపంజారానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఏదేమైనా.. బ్యాంకులు అమలు చేస్తున్న నిబంధనల కారణంగా సామాన్యులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారనడానికి తాజా ఘటన ఉదాహరణ.
బడా వ్యాపారులకు మినహాయింపులు
బ్యాంకుల్లో పేరుకున్న మొండి బకాయిలను రద్దు చేయడాన్ని బ్యాంకర్లు ‘రైట్-ఆఫ్’ అంటారు. ఇది కేవలం అకౌంటింగ్ ప్రక్రియలో ఒక భాగం మాత్రమే బ్యాంకులు కొట్టి పడేస్తున్నాయి కానీ.. రుణం తీసుకున్న ప్రతిఒక్కరూ తిరిగి చెల్లించాల్సిన బాధ్యత ఉంటుందని ఆర్బీఐ నిబంధనలు చెబుతున్నాయి. అయినప్పటికీ.. బడా వ్యాపార వేత్త లు, కార్పొరేట్ దిగ్గజాలు తీసుకుంటున్న రు ణాల రికవరీ విషయంలో బ్యాంకులు ఎన్నో మినహాయింపులు, వెసులుబాట్లు ఇస్తున్నాయి.
సదరు వ్యాపారుల కోసం రుణాల పునర్వ్యవస్థీకరణ (డెబిట్ రీస్ట్రక్చరింగ్) వంటి ప్రత్యామ్నాయమార్గాలను వెతుకుతున్నా యి. తద్వారా వ్యాపారులకు తక్షణ ఉపశమనం కల్పిస్తున్నాయి. కానీ, చిన్న చిన్న ఖా తాదారుల విషయానికి వస్తే మాత్రం కఠినమైన నిబంధనలు అమలుచేస్తున్నాయి. కేం ద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పార్లమెంటులో వెల్లడించిన వివరాల ప్రకా రం.. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు గత 11 ఆర్థిక ఏళ్లలో 9.75 లక్షల కోట్ల రూపాయల రుణాలను రైట్-ఆఫ్ చేశాయి.
ఇతర విశ్లేషణల ప్రకారం ఈ మొత్తం సుమారు 19 లక్షల కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని అంచనా. ముఖ్యం గా 2020 ఆర్థిక ఏడాదిలో ఈ రుణాల మా ఫీ గరిష్ట స్థాయికి చేరింది. ఆ సమయంలో నిరర్థక ఆస్తుల ప్రక్షాళనలో భాగంగా 1.59 లక్షల కోట్ల నుంచి 2.43 లక్షల కోట్ల రూపాయల వరకు రద్దు చేశారు. పెద్ద కంపెనీల బకాయిల విషయంలో బ్యాంకులు ఇంతటి ఉదారత చూపిస్తున్నాయి.
అదే సమయం లో సామాన్యులు తమ సొంత సొమ్ము కో సం అధి కారుల చుట్టూ తిరగాల్సి రావడం వ్యవస్థలోని వివక్షకు అద్దం పడుతున్నది. సామా న్యుల క్లెయిమ్స్‌కు బ్యాంకులు కొరకరాని కొర్రీలు పెట్టి వేధిస్తున్నాయి. ఇదే కోవ లో తాజాగా జీతూ ముండా కూడా బాధితుడయ్యాడు. ఇలా వెలుగు చూడని పేదల దీన గాథలు ఇంకెన్ని ఉంటాయో అని ఆలోచిస్తే హృదయం ద్రవిస్తుంది.
బ్యాంకింగ్ వ్యవస్థలో మార్పు రావాలి..
బ్యాంకింగ్ రంగంపై ఆర్థిక నిపుణులు కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు. రూ.50 వేల లోపు నిల్వలు ఉన్న సేవింగ్స్ ఖాతాలకు మరణ ధ్రువీకరణ ప్రక్రియను సులభతరం చేయాలి. కేవలం అఫిడవిట్ లేదా నామినీ సంతకంతోనే డబ్బులు ఇచ్చే లా నిబంధనలు మార్చాలి. ఆధార్ ఆధారిత ధ్రువీకరణను ఎక్కువగా వాడాలి. గిరిజన ప్రాంతాల్లో తక్షనం బ్యాంకు సేవలు అందించేందుకు ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేయాలి. గ్రామీణ బ్యాంక్ సిబ్బందికి పేద ప్రజల పట్ల సానుభూతి, మానవతా దృక్పథంతో వ్యవహరించేలా శిక్షణ ఇవ్వాలి.
ఘటన దేనికి సంకేతం?
భారత బ్యాంకింగ్ రంగం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిందని తరచూ మనం వార్తలు చూస్తుంటాం. కానీ, క్షేత్రస్థాయిలో ఆ సాంకేతికతపై సామాన్యులకు ఏ మేరకు అవగాహన ఉందనేదే ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. నిబంధనలను అమలు చేసేటప్పుడు మానవీయ కోణంలో ఉండాలే తప్ప, ఖాతాదారును, అతని కుటుంబాన్ని పీల్చిపిప్పి చేసేలా ఉండకూడదు. కేవలం రూ.20 వేల కోసం ఒక పౌరుడు సమాధిని తవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఇది ఎంతటి దారుణం.
నగరాల్లోని చదువుకున్న ఖాతాదారులను దృష్టిలో పెట్టుకుని సిద్ధం చేసిన నియమాలు గ్రామీణ ఖాతాదారులకు ఎలా సరిపోతాయనేది బ్యాంకులు పునరాలోచించుకోవాలి. నగరాలు, పట్టణాలకు చెందిన ఖాతాదారులకు రూ.౨౦ వేలు పెద్దమొత్తం కాకపోవచ్చు. కానీ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆ సొమ్ము చాలా.. చాలా పెద్ద మొత్తం. బ్యాంకర్లు ఈ సున్నితమైన విషయాన్ని మానవీయ కోణంలో ఆలోచిస్తే మంచిది.






