12-11-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 11 (విజయక్రాంతి): ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ సీఐడీ సిట్ విచారణ ముగిసింది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన కేసులో ఆయన మంగళవారం సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. గంటకు పైగా సాగిన ఈ విచారణలో అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్‌ల ప్రకటనలలో నటించినందుకు విజయ్ దేవరకొండ అందుకున్న రెమ్యునరేషన్, కమీషన్ల వివరాలపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం.
ఈ లావాదేవీలకు సంబంధించిన పత్రాలు, ఇతర వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. విచారణ ముగిసిన అనంతరం, విజయ్ దేవరకొండ మీడియా కంట పడకుండా సీఐడీ కార్యాలయం వెనుక గేటు నుంచి వెళ్లిపోయారు. ఇదే కేసులో విచారణకు హాజరు కావాలని సీఐడీ సిట్ అధికారులు నటుడు ప్రకాశ్‌రాజ్‌కు కూడా నోటీసులు జారీ చేయగా.. ఆయన కూడా విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో మరికొంత మంది సినీ ప్రముఖులకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.