calender_icon.png 26 September, 2025 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజన్ దోపిడీ

26-09-2025 01:05:50 AM

  1. మధురవనం పేరుతో బురిడీ అనుమతులు నిల్.. అమ్మకాలు ఫుల్..
  2. అక్రమంగా రియల్ ఎస్టేట్ వెంచర్ రంగురంగుల బ్రోచర్లతో నయా మోసం
  3. ఆఫర్లంటూ కస్టమర్లకు అంటగడుతున్న వైనం చోద్యం చూస్తోన్న అధికార యంత్రాంగం

నల్లగొండ, సెప్టెంబర్ 25(విజయక్రాంతి) : అది కొండమల్లేపల్లిలోని మండలంలోని కోల్‌ముంతల్‌పహాడ్ గ్రామం. పైగా హైదరాబాద్- నాగార్జునసాగర్ హైవే. ఇంకేముందీ పచ్చని భూముల్ని వెంచర్లుగా మార్చేసి.. రంగురంగుల బ్రోచర్లతో కస్టమర్లను బురిడీ కొట్టించి.. ఆఫర్ల పేరుతో ప్లాట్లను అంటగడుతున్నారు. కొండమల్లేపల్లి మండల కేంద్రానికి కూతవేటు దూరంలో విజన్ ఇన్‌ఫ్రా డవలపర్స్ భారీ ఫామ్ లాండ్ దందాకు తేరలేపింది.

మధురవనం పేరుతో ఏకంగా 243 ఫామ్ ల్యాండ్ ప్లాట్లను వెంచర్‌గా చేసి విక్రయాలను మొదలుపెట్టింది. అయితే సదరు వెంచర్ ఏర్పాటుకు కనీస అనుమతులు లేకపోవడం గమనార్హం. అయితే ఈ ఫామ్ ల్యాండ్ అక్రమ దందాకు రెవెన్యూ యంత్రాంగం వంతపాడుతుండడం కొసమెరుపు. వ్యవసాయ భూమిని గుంటల్లో రిజిస్ట్రేషన్ చేసేందుకు కొండమల్లేపల్లి తహసీల్దార్ కార్యాలయం వేదిక అయ్యింది. ఇంత జరుగుతున్నా.. జిల్లా రెవెన్యూ యంత్రాంగం మొద్దు నిద్రను వీడడం లేదు.

స్పెషల్ ఆఫర్లంటూ బుకింగ్‌లు..

కొండమల్లేపల్లి మండలంలోని కోల్‌ముంతల్‌పహాడ్ రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 89, 90,92, 93ల్లో విజన్ ఇన్‌ఫ్రా డవలపర్స్ ఆధ్వర్యంలో మధురవనం పేరు ఫ్యామ్ ల్యాండ్ వెంచర్ ఏర్పాటయ్యింది. ఈ వెంచర్‌లో ఒక గుంట దగ్గరి నుంచి మొదలు పెడితే.. ఐదారు గుంటల వరకు గుట్టుచప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. నిజానికి డీటీసీపీ, రేరా వంటి అనుమతులేవి లేకుండానే ఫామ్ ల్యాండ్ ప్లాట్ల విక్రయాలు జోరందుకున్నాయి.

అయితే సదరు వెంచర్ యాజమాన్యం ఇందులో కొత్త తరహా దందాకు తేరలేపింది. రిజిస్ట్రేషన్లు గుంటల్లో చేస్తున్నప్పటికీ.. అమ్మకాలు మాత్రం గజాల లెక్కన డబ్బులు దండుకుంటుండడం గమనార్హం. అయితే ప్రతి ఆదివారం స్పెషల్ ఆఫర్ పేరుతో కస్టమర్లను వెంచర్ వద్దకు తీసుకొచ్చి నాన్‌వెజ్ భోజనం.. రంగురంగుల బ్రోచర్లతో బురిడీ కొట్టించి ప్లాట్లను అంటగట్టేస్తున్నారు.

పైగా హైదరాబాద్- నాగార్జునసాగర్ హైవే కావడంతో హైదరాబాద్ మహానగరంతో పాటు మహాబూబ్‌నగర్, నల్లగొండ జిల్లా కేంద్రాల నుంచి సైతం కస్టమర్లను కార్లలో తరలించి ప్లాట్లు కొనుగోలు చేసేలా మాయమాటలు  చెబుతుండడం కొసమెరుపు.

టెంప్ట్ అయ్యారా.. ఇక అంతే..

హైదరాబాద్- నాగార్జునసాగర్ హైవేదే భవిష్యత్ అంతా.. ఫ్యూచర్‌లో ఇక్కడ సైతం ఫార్మా సిటీ, ఫ్యూచర్ సిటీ వంటివి రాబోతున్నాయి. హైదరాబాద్ చుట్టూ పక్కలా భూమి అయిపోయింది. ఇక మిగిలింది ఈ హైవేకే. పైగా నాగార్జునసాగర్ ప్రాజెక్టును హైదరాబాద్ మహానగరం  భవిష్యత్‌లో పర్యాటకంగా కలిసిపోయే పరిస్థితి వస్తుందంటూ కస్టమర్లను గాలిలోనే మేడలు కట్టేలా చేస్తున్నారు.

వాస్తవానికి సగటు సామాన్యుడు భవిష్యత్ అవసరాల కోసం.. పిల్లల ఫ్యూచర్ కోసం మాత్రమే ప్లాట్లను కొనుగోలు  చేస్తుంటారు. ఆ అవకాశాన్ని ఆసరాగా చేసుకుని కస్టమర్లు ప్లాట్లు బుక్ చేసే వరకు వదలడం లేదు.

ఈ దందాలో ఏజెంట్లు, దళారులకు భారీగా కమీషన్లు ఇస్తుండడంతో ప్రైవేటు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఇదే పనిచేస్తూ తొటి ఉద్యోగులు, బంధువులు, స్నేహితులకు అక్రమ ప్లాట్లను అంటగడుతున్నారు. తీరా ఆ ఫాట్లలో ఇల్లు కట్టుకోవాలంటే.. మస్తు తిప్పలు పడాల్సి వస్తుంది. దీంతో అప్పడు లబోదిబోమనడం కస్టమర్ల వంతుగా మారింది. ఈ దందాను అడ్డుకోవాల్సిన రెవెన్యూ యంత్రాంగం చేష్టలూడిగి చూస్తోంది.