10-09-2025 07:22:19 PM
మందమర్రి (విజయక్రాంతి): సొంతింటి కల సాధన కోసం కార్మికుల అభిప్రాయ సేకరణలో భాగంగా నిర్వహిస్తున్న పోలింగ్ లో కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొని ఓటింగ్ ని విజయవంతం చేయాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సాంబారు వెంకటస్వామి, అల్లి రాజేందర్ లు కోరారు. బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ, సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల సందర్భంగా అన్ని యూనియన్ లు, ప్రభుత్వాలు, సింగరేణి కార్మికులకు సొంత ఇంటి కల నెరవేరుస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖం చాటేశారని విమర్శించారు.
సింగరేణి కార్మికులకు సొంత ఇల్లు కావాలా... సింగరేణి క్వార్టర్ కావాలా... అనే అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ఈనెల 11, 12 తేదీలలో సింగరేణి వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో అన్ని గనులు, డిపార్ట్మెంట్ లలో కార్మికులతో ఓటింగ్ నిర్వహిస్తున్నామని, దీనిపై కార్మికులకు సమావేశాలు, కరపత్రాలు, సోషల్ మీడియా, తదితర రూపాలలో ప్రచారం చేపట్టి కార్మికులకు అవగాహన కల్పించామన్నారు. ఈ వినూత్న కార్యక్రమానికి కార్మికుల నుండి అనూహ్యమైన స్పందన వస్తుందని వారు స్పష్టం చేశారు. కార్మికులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గని/డిపార్ట్ మెంట్ వద్ద ఏర్పాటు చేసిన డబ్బాలలో నాయకులు అందజేసిన పోలింగ్ స్లిప్పులో తమ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలిపి బ్యాలెట్ బాక్స్ లో వేయాలని కోరారు. ఈ పోలింగ్ కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగడానికి యాజమాన్యం సహకరించాలన్నారు. ఎవరి మాయ మాటలు నమ్మకుండా ముందుకు వచ్చి ఓటింగ్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.