calender_icon.png 9 September, 2025 | 7:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిహారం కోసం ఎదురుచూపులు!

09-09-2025 01:16:17 AM

  1. సిగాచి మృతుల కుటుంబాలకు న్యాయం జరిగేనా ?

పరిహారం చెల్లింపులో స్పష్టత కరువు

ఇంకా విడుదల కాని హై పవర్ కమిటీ నివేదిక

బాధితుల తరఫున సీనియర్ సైంటిస్టు బాబూరావు హైకోర్టులో పిల్ దాఖలు 

ప్రభుత్వం తరఫున చీఫ్ సెక్రటరీ కౌంటర్ దాఖలు 

ఈ నెల 16న తదుపరి విచారణ

సంగారెడ్డి, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి ఫార్మా కంపెనీలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మృతి చెందిన కార్మిక కుటుంబాలకు అందించాల్సిన పరిహారం పరిహాసంగా మారుతోంది. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం కోసం బాధిత కుటుంబాలకు ఎదురు చూపులు తప్పడం లేదు.

మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్‌రెడ్డి రూ.కోటి నష్టపరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 లక్షలు ఇవ్వనున్నట్లు చెప్పారు. అంతేగాకుండా ప్రమాదాని కి గల కారణాలను తెలుసుకోవడానికి ప్రభు త్వం నిపుణుల కమిటీ, హైపవర్ కమిటీని వేసింది. ప్రమాదం జరిగి రెండు నెలలు దాటినా ఎంపదకు నష్టపరిహారం ఇస్తలేరని,

ప్రమాదానికి కారణమైన కంపనీ యాజమాన్యంపై కేసు నమోదైనా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని, నష్టపరిహారం ప్రభు త్వం చెల్లిస్తుందా లేక యాజమాన్యం చెల్లిస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారడంతో సీనియర్ సైంటిస్టు బాబూరావు అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీంతో ప్రభుత్వం గతనెల 27 వరకు సమయం కోరింది. ఈ క్రమంలోనే సిగాచి కేసు విచారణ జరిగింది.

ఈ విచారణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. హోం, పరిశ్రమల, కార్మిక శాఖలు, జిల్లా కలెక్టర్ నుంచి వచ్చిన సమాచారంతో చీఫ్ సెక్రటరీ ఏకీకృత కౌంటర్‌ను దాఖలు చేశా రు. ఈ నెల 16న విచారణ జరగనుంది.

ప్రభుత్వం వెల్లడించిన వివరాలు..

సిగాచి ఘటనలో మరణించిన, గాయపడిన శాశ్వత, తాత్కాలిక, కాంట్రాక్ట్ కార్మికుల జాబితాను ప్రభుత్వం కౌంటర్‌లో పొందుపరిచింది. మరణించిన వారిలో 20 మంది సాధారణ ఉద్యోగులు, 16 మంది తాత్కాలిక కార్మికులు, 10 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో, ఏ రాష్ట్రానికి చెందిన వారో కూడా వివరాలు అందించారు. మరణించిన ఒక్కో కార్మికుడి కుటుంబానికి రూ.కోటి చెల్లించడానికి కంపెనీ అంగీకరించిందని, ఈ మేరకు లేబర్ డిపార్ట్‌మెంట్‌కు లేఖ రాసినట్లు పేర్కొన్నారు.

అయితే పరిహారం చెల్లింపునకు సంబంధించిన కాలపరిమితి ఇవ్వకపోవడం ఆందోళన కలిగించే విషయం. గల్లంతైన కార్మికులు కూడా మరణించినట్లు అధికారులు నిర్ధారించారు. అయితే ఇంకా డెత్ సర్టిఫికెట్లు విడుదల కాలేదు. గల్లంతైన వారిలో ఐదుగురు సాధారణ ఉద్యోగులు. ఇద్దరు తాత్కాలిక ఉద్యోగులు కాగా ఒకరు కాంట్రాక్ట్ ఉద్యోగి ఉన్నారని తెలిపారు. ఫ్యాక్టరీలో వారి ఉనికిని హాజరు రిజిష్టర్లు, బయోమెట్రిక్ డేటా, మొబైల్ లొకేషన్లు ధృవీకరించాయని కౌంటర్ పేర్కొంది. కంపెనీలో దుమ్ము, మండే స్వభావం కలది ప్రమాదకరంగా ఉందని.

ఈ విషయాన్ని కంపెనీ నిర్లక్ష్యం చేసిందని వెల్లడించారు. దీనిపై కంపెనీ బాధ్యత ఉన్నదని నిపుణుల కమిటీ మధ్యంతర నివేదికలో ఈ విషయాన్ని ధృవీకరిం చిందని పేర్కొన్నారు. కాగా 43 మరణ ధృవీకరణ పత్రాలు సిద్ధంగా ఉన్నాయని, మరో ముగ్గురివి పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. గల్లంతైన 8 మందికి సంబంధించిన సర్టిఫికెట్లు కూడా త్వరలో సిద్ధం కానున్నాయి.

గల్లంతైన 8 మంది కోసం తహసీల్దార్ ప్రత్యేకంగా ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. కాగా మరణించిన, గల్లంతైన కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు చెల్లించారు. గాయపడిన 28 మంది లో 11 మందికి తీవ్ర గాయాలు, 17 మందికి స్వల్ప గాయాలయ్యాయి. యాజమాన్యం 17 మంది కార్మికులకు రూ.4.5 లక్షలు, ఏడుగురికి రూ.9.5 లక్షలు, మరో  కార్మికుడికి రూ.లక్ష చెల్లించింది.

ఈ చెల్లింపులు ఇంకా స్పష్టంగా లేవు. ముగ్గురు కార్మికులకు ఇంకా చికిత్స కొనసాగుతోంది. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని స్పష్టం చేసింది. జిల్లా ఫైర్ ఆఫీసర్ తరఫున సంగారెడ్డిలోని మెజిస్ట్రేట్ కోర్టులో కేసులు దాఖలు చేయబడ్డాయని, వివరాలు కౌంటర్‌లో ఉన్నాయని పేర్కొన్నారు.

డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సెక్షన్ 92 ఫ్యాక్టరీస్ యాక్ట్ కింద షోకాజ్ నోటీసు జారీ చేశారు. హై పవర్ కమిటీ నివేదిక ఇంకా విడుదల కాలేదని, నిపుణుల కమిటీ మధ్యంతర నివేదిక మాత్రమే విడుదల చేయబడిందని తెలిపారు. ఈ నెల 16న తదుపది విచారణ ఉందని అప్పటిలోగా తాము రిప్లై దాఖలు చేయాలని కౌంటర్‌లో పేర్కొన్నారు.